మళ్లీ వస్తున్నా
మళ్లీ వస్తున్నా
Published Wed, Feb 12 2014 3:35 AM | Last Updated on Wed, Sep 18 2019 2:56 PM
మళ్లీ వస్తున్నా అవకాశాలివ్వండి అంటోంది బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా. ఒక సారి ముఖానికి రంగేసుకున్న తరువాత దానికి దూరం అవడం అంత సులభం కాదు. ముఖ్యంగా హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగిన నటీమణులకు సినిమా ఆశ తీరదు. పెళ్లి అయిన తరువాత కూడా తమ హవా కొనసాగించాలని కోరుకుంటారు. కొందరికి అది చెల్లినా అలాంటి అవకాశాలు లేనివారు అక్కగానో, వదినగానో చివరికి అమ్మగా నటించడానికైనా సిద్ధపడటం చూస్తూనే ఉన్నాం. అలా మళ్లీ ముఖానికి రంగేసుకోవాలని తహతలాడుతున్న పెళ్లయిన వారి జాబితాలో తాజాగా జెనీలియా చేరారు. ఉత్తరాది నుంచి దక్షిణాది కొచ్చి హీరోయిన్‌గా ప్రకాశించిన హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. తమిళంలో బాయ్స్ చిత్రం ద్వారా తెరపైకి వచ్చిన దరహాసిని ఆ తరువాత విజయ్, ధనుష్, జయంరవి వంటి ప్రముఖ హీరోల సరసన నటించి మంచి పేరు పొందారు.
టాలీవుడ్‌లోను హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ప్రేమలోపడి ఆ తరువాత ఆయన్నే జీవిత భాగస్వామిని చేసుకున్నారు. దీంతో నటనకు స్వస్తి చెప్పారు. తాజాగా ఈ ముద్దుగుమ్మకు మళ్లీ నటించాలనే కోరిక పుట్టిందట. భర్త అనుమతితో ఇప్పటికే హిందీ చిత్రం జయహోలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఇక తమిళం, తెలుగు భాషలలోనూ నటించాలని భావిస్తున్నారట. దీంతో తనకు బాగా సన్నిహితమయిన దర్శక నిర్మాతలకు ఫోన్ చేసి తాను నటించడానికి సిద్ధం. మంచి అవకాశాలివ్వండని అడుగుతున్నారు. దక్షిణాదిలో మరో రౌండ్ కొడతాననే దృఢ నిశ్చయంతో ఉన్నారు.
Advertisement
Advertisement