
ఐరా చిత్రంలో నయనతార
సినిమా: సినీ వర్గాల్లో ఐరా చిత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దక్షిణాదిలో స్టార్ హీరోల చిత్రాలకు దీటుగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు ఉంటున్నాయంటే అవి నయనతార నటించినవేనని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ అగ్రనటి నటించిన హీరోయిన్ సెంట్రిక్ చిత్రాలు ఒకటి రెండు ఏవరేజ్ అయ్యాయేమో. మిగిలినవన్నీ హిట్టే. అలా మాయ చిత్రంతో ప్రారంభమైన నయనతార కథలో నాయకిగా నటించిన చిత్రాల సక్సెస్ అరమ్ వరకూ సాగింది. అ తరువాత ఈ జాణ నటించిన ఇమైకా నొడగళ్ వంటి చిత్రాల విజయాన్ని కూడా నయనతార ఖాతాలోనే పడుతుంది. తాజాగా నటిస్తున్న చిత్రం ఐరా. ఇదీ హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రమే. ఇందులో విశేషం ఏమిటంటే నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం. ఈ చిత్రంలో నయనతార బాడీలాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుందంటున్నాడు దర్శకుడు సర్జన్. ఈయన లక్ష్మీ అనే లఘు చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఐరా ద్వారా సినీరంగానికి పరిచయం అవుతున్నారు.
ఈ చిత్ర టైటిల్ మాత్రమే కాదు, ఇటీవల విడుదలైన టీజర్ కూడా చాలా ఆసక్తిగా ఉంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఐరా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ దీని కోసం నయనతార చాలా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. తన మేకప్ నుంచి అన్ని విషయాలు కొత్తగా ఉండాలని సాధారణ మేకప్ వదిలేశారని చెప్పారు. నయనతార ఇంత వరకూ నటించనటువంటి పాత్రలో నటింపజేయాలన్న ప్రయత్నమే ఐరా చిత్రం అన్నారు. ఇందులో నయనతార బాడీలాంగ్వేజ్‌ను చూసి ప్రేక్షకులు విస్మయం చెందుతారని అన్నారు. నయనతార ఈ చిత్రంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. భవానీ అనే పాత్రలో బ్లాక్ అండ్ వైట్‌లోనే ఆమె కనిపిస్తుందని చెప్పారు. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఆ సన్నివేశాలు తనకే చాలా నచ్చాయన్నారు. అలా చూపిం చాలని కథ రాసుకున్నప్పుడే నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇక రెండో పాత్రలో నయనతార ఒక సాధారణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా కనిపిస్తుందని తెలిపారు. సాధారణం ఇద్దరూ ఒకేలా ఉంటే వారు కవలపిల్లలైనా అయిఉండాలి, లేక అక్కచెళ్లెళ్లు అయినా అయి ఉంటారన్నారు. అయితే ఐరా చిత్రంలో నయనతార రెండు పాత్రలకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పారు. చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా చాలా మంచి స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చిందన్నారు. దీంతో చిత్ర విజయం ఖాయం అనే నమ్మకం ఏర్పడిందని, త్వరలోనే ఐరాను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.