
సినిమా: తెలుగులో చిరంజీవికి జంటా సైరా చిత్రంలో నటిస్తున్న నటి నయనతార తమిళంలో ఐరా చిత్రంలో నటిస్తుండడం విశేషం. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న ఏకైక కథానాయకి నయనతార. అదేవిధంగా చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి ఈమె. ఈమె సెంట్రిక్ కథా పాత్రల్లో నటించిన మాయ, ఆరం వంటి చిత్రాలు సక్సెస్ కావడంతో ఆ తరహా చిత్రాలు నయనతార వైపే చూస్తున్నాయి. ఇటీవల ఈ సంచలన నటి నటించిన కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ చిత్రాలు వరుసగా విజయం సాధించడంతో నయనతార క్రేజ్ మరింత పెరిగింది. తాజాగా మరోసారి హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంతో తెరపైకి రావడానికి నయనతార సిద్ధం అవుతోంది. ఇంతకుముందు అరమ్, గులేభకావళి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ స్టూడియోస్ సంస్థ తాజాగా నయనతార హీరోయిన్‌గా నిర్మిస్తున్న చిత్రానికి సర్జిన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈయన ఇంతకు ముందు హెచ్చరికై ఇదు మణిదర్‌గళ్ నడమాడుం ఇదం అనే సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. ఈయన తాజా చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. దీని ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి ఐరా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. దీని గురించి దర్శకుడు సర్జన్ తెలుపుతూ నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఇదని చెప్పారు. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఐరా చిత్రంలో ఆమె ఇంతకు ముందెప్పుడూ నటించనటువంటి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. ఇందులో రెండు పాత్రలు ఒక దానికి ఒకటి సంబంధం లేకుండా కాంట్రస్ట్‌గా ఉంటాయని చెప్పారు. ఐరా అంటే ఇంద్రుడి వాహనం ఐరావతం అని అర్థం, ఇందులో ఏనుగు లాంటి బలమైన పాత్రలో నయనతార నటించారని తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబరులో క్రిస్మస్ పండగ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఐరా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూసి నయనతార అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.