వాట్‌ ఎ షేమ్‌! | heroine sneha Wrote a letter in support of women in social media | Sakshi
Sakshi News home page

వాట్‌ ఎ షేమ్‌!

Published Thu, Feb 23 2017 12:28 AM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

వాట్‌ ఎ షేమ్‌! - Sakshi

వాట్‌ ఎ షేమ్‌!

‘‘మహిళలను దేవతలుగా కొలిచిన నేలపై ఇన్ని దారుణాలా?! అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది? నిర్భయ, నందినీలకు జరిగినట్లు ఎవరికీ జరగకూడదు. అలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. మాకు కావలసింది న్యాయం, గౌరవం. దయచేసి ఈ దారుణాలను ఆపండి’’ అని ఆగ్రహావేదనలు వ్యక్తం చేశారు నటి స్నేహ. మహిళలకు మద్దతుగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా ఆమె గళం విప్పారు. భావన, వరలక్ష్మీలకు మద్దతుగా సోషల్‌ మీడియాలో ఆమె ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇది:
నా సహచర నటీమణులు భావన, వరలక్ష్మీలకు ఎదురైన అనుభవాలను తలచుకుంటుంటే నా మనసు తీవ్రంగా ఆవేదన చెందుతోంది. మనస్ఫూర్తిగా వాళ్లకు నా మద్దతు తెలుపుతున్నాను. ధైర్యంగా వాళ్లు మాట్లాడిన తీరుని ప్రశంసిస్తున్నాను. ఇటువంటి ఘటనల గురించి ఓపెన్‌గా హ్యాండిల్‌ చేసిన విధానంలో వాళ్ల  పరిణతి కనిపిస్తోంది.

ఇంకెన్నాళ్లీ ప్రేక్షక పాత్ర?
మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అవమానాలు... ప్రతి రోజూ సమాజంలో ఏ మూలన చూసినా ఇటువంటి ఘటనలే కనిపిస్తున్నాయి. చాలామంది బాధిత మహిళలు తమ మనసులో మాటలు చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్లూ ఓ భాగమైన ఈ సమాజమే కారణం. ఇటువంటి దురాగతాలు జరిగినప్పుడు ఎక్కువగా అమ్మాయిలనే నిందిస్తున్నారు. నైతిక విలువలు, సంప్రదాయ పరిరక్షణకు పాటుబడుతున్నామని ప్రచారం చేసుకునేవాళ్లు... అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? ఎక్కడికి వెళ్లాలి? ఎవరితో వెళ్లాలి? అనేవి చెబుతారు. ఈ సందర్భంగా నేను వాళ్లను ఒకటి అడగాలనుకుంటున్నాను. మూడేళ్ల పసిపాపలు, ఏడేళ్ల చిన్నారులపై అకృత్యాలు, అఘాయిత్యాలు జరిపి చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. ఏం జరుగుతుందో కూడా వాళ్ల ఊహకు తెలీదు. ఇలాంటి అకృత్యాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు. ఇంకెన్నాళ్లు ప్రేక్షక పాత్ర పోషిస్తారు? ఓ మై గాడ్‌! హృదయ విదారకరమైన ఫొటోలు చూస్తుంటే, నా మనసు ముక్కలవుతోంది. ఓ తల్లిగా ఆ చిన్నారుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోగలను.

ఆ రోజులు పోయాయి
తప్పు ఎక్కడ జరిగింది? ‘మదర్‌ ఇండియా’గా, దేశాన్ని అమ్మగా పిలవబడే రాజ్యంలో ఏం జరుగుతోంది?  జీవనదులకు మహిళల పేర్లు పెడతారు. దేవుడితో సమానంగా దేవతలను పూజిస్తారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ‘దేవుడు తనలో సగభాగాన్ని అర్ధాంగికి ఇచ్చాడు’ అని చెబుతారు. ఓ ఆడదాని కారణంగా రాజ్యం రావణకాష్టంలా తగలబడిందనే కథలు విన్నాము. మహిళలను చాలా విధాలుగా కొలిచే దేశం ఇది. కానీ, మహిళలు గర్వంగా తలెత్తుకుని, హుందాగా గౌరవంతో బతికే రోజులు పోయాయి. ఇప్పుడీ మాట చెబితే ఎప్పుడో గడిచిన గతంలా ధ్వనిస్తుంది. వాట్‌ ఎ షేమ్‌!!

ఆ ఆలోచన వస్తే.. వెన్నులో వణుకుపుట్టాలి
ఇటువంటి అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడాలనే నిర్ణయం తీసుకోవడానికి ఇంతకు మించిన తరుణం లేదు. మహిళల గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి.. అంతకు ముందు ఉన్నట్టు మేము సురక్షితంగా ఉన్నామని మహిళలు ధైర్యంగా ఉండడానికి పొరాటం చేయవలసిన సమయమిదే. ముఖ్యంగా... పసిపాపలను అబ్యూజ్‌ చేయడానికి కూడా ఏ మగాడైనా భయపడాలి. మనసులో అలాంటి ఆలోచన చేయడానికి కూడా భయపడాలి. నేరస్తుల వెన్నులో వణుకు పుట్టించే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. న్యాయవ్యవస్థను పటిష్టం చేయాలి.

నిర్భయ, నందిని, రితిక, హాసిని... ఇంకా ఎంతమంది? ఇక ఈ దేశంలో బాధితులు ఉండకూడదు. మాకు న్యాయం కావాలి. మాకు గౌరవం కావాలి. గౌరవంగా బతికే హక్కు కావాలి. మా హక్కులను సాధించుకునే గెలుపు కావాలి. ఈ సందర్భంగా నేనొక చిన్న అడుగు వేస్తున్నాను. చిన్నదే కానీ చాలా ముఖ్యమైన అడుగు ఇది. ఓ తల్లిగా నేనో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ‘మహిళలను గౌరవంగా చూసేలా.. మహిళల అర్హతకు తగ్గట్టు వాళ్లతో హుందాగా ప్రవర్తించేలా’ నా కుమారుణ్ణి పెంచుతానని అందరికీ మాటిస్తున్నాను.

సేలంలో ఐదుగురు వ్యక్తులు కలసి పదేళ్ల అమ్మాయిని వేధించి చంపేశారు. తమిళనాడులో ఏం జరుగుతోంది? ప్రతి రోజూ వార్తల్లో ఇలాంటివి కనిపించడం కామన్‌ అవుతుందా?? దయచేసి ఈ దుర్మార్గాలను ఆపండి.
– స్నేహ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement