కథానాయికలు లేటెస్ట్ ట్రెండ్‌కి మారిపోయారు. ఓన్లీ గ్లామర్, సాంగ్స్‌కే కాదు. యాక్షన్ సినిమాలు చేయడానికైనా, బయోపిక్స్‌లో ఒదిగిపోవడానికైనా, థియేటర్స్‌లో ఆడియన్స్‌ను భయపెట్టడానికైనా సై అంటున్నారు. వారి ఉత్సాహాన్ని బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఆడియన్స్‌ను భయపెట్టి మంచి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి భయమే అభయంగా బాక్సాఫీస్ వద్ద వెండితెర ఆత్మలుగా హారర్ సినిమాల కోసం ప్రిపేర్ అవుతున్న కొందరి హారోయిన్స్ గురించి తెలుసుకుందాం.
ఐరాగా.. అందాల తార
రెండేళ్ల క్రితం ‘డోరా’ సినిమాతో భయపెట్టడానికి ఆడియన్స్‌ను థియేటర్స్‌లోకి పిలిచారు నయనతార. కానీ ప్రేక్షకులు అంతగా భయపడలేదు. ఇప్పుడు ‘ఐరా’ సినిమాతో మరో సారి భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు నయన్. ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో హారర్ అంశాలు పుష్కలంగానే ఉన్నట్లు అర్థం అవుతోంది. ఇందులో నయనతార డబుల్ రోల్ చేయగా ఒకటి డీ–గ్లామర్ రోల్ కావడం విశేషం. కేఎమ్. సర్జున్ దర్శకత్వం వహించిన ‘ఐరా’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది.
నయనతార
ట్రిపుల్ టెర్రర్
కథానాయిక అంజలి చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా లిస్ట్‌ను చెక్ చేస్తే అందులో మూడు హారర్ సినిమాలు (గీతాంజలి 2, ఓ, లీసా)ఉన్నాయి. 2004 లో వచ్చిన ‘గీతాంజలి’ సక్సెస్ సాధించింది. ఇప్పుడు సీక్వెల్‌కు ప్రిపేర్ అవుతున్నారు. మరో హారర్ మూవీ ‘లీసా’ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఈ సినిమాకు త్రీడీ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమాని హిందీలో కూడా డబ్ చేయాలనుకుంటున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకుడు. ఇక ‘ఓ’ సినిమా దగ్గరకు వస్తే... తన చుట్టూ ఏం లేకపోయినా ఏదో ఉందని ఊహించుకుని భయపడే క్యారెక్టర్‌లో అంజలి నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రవీణ్ దర్శకుడు. ఇలా.. ఈ ఏడాది ట్రిపుల్ హారర్ థమాకా ఇవ్వనున్నారు అంజలి.
అంజలి
మహా భయం
తన సినీ కెరీర్‌లో 50వ చిత్రాన్ని కాస్త డిఫరెంట్‌గా ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యారు హన్సిక. ఆ ఆలోచనలోనే ‘మహా’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హారర్ అండ్ సస్పెన్స్‌తో కూడిన చిత్రమిది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ వివాదం అయ్యాయి. కానీ, టీమ్ మాత్రం ఎప్పటికప్పుడు డిఫరెంట్ పోస్టర్స్‌ను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు యుఆర్ జమీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.
హన్సిక
ఫాంటసీ హారర్
ప్రస్తుతం సౌత్‌లో మంచి బిజీగా ఉన్నారు రాయ్‌లక్ష్మీ. కన్నడలో ‘ఝాన్సీ’, తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ’ సినిమాల షూటింగ్స్‌ను కంప్లీట్ చేసిన ఆమె ‘సిండ్రెల్లా’ అనే ఫ్యాంటసీ కమ్ హారర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇటీవలే సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. వినోద్ వెంకటేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదలవుతోంది.
రాయ్‌లక్ష్మీ
థ్రిల్లింగ్ హారర్
థియేటర్లో ‘అరుంధతి’ సినిమా చూసిన ప్రేక్షకులు తర్వాత ఇంటికి ఒంటరిగా వెళ్లడానికి జంకేలా ఉన్నాయి ఆ సినిమాలో హారర్ సీన్స్. ఆ తర్వాత అనుష్క ‘పంచాక్షరి, భాగమతి’ వంటి సినిమాలను చేసినప్పటికీ ఆ రేంజ్ హిట్‌ను సాధించలేకపోయారనే చెప్పొచ్చు. మళ్లీ ఇప్పుడు ‘అరుంధతి’ రేంజ్‌లో ఆడియన్స్‌ను హడలెత్తించడానికి రెడీ అవుతున్నారట అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారామె. ఇది కేవలం హారర్ సినిమానే కాదు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉంటాయట. ఇందులో మాధవన్, అంజలి, షాలినీ పాండే కూడా నటిస్తారు. కొంతమంది హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారట. మార్చిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది.
∙‘భాగమతి’లో అనుష్క
ఎక్స్‌ట్రా ఫియర్
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ఆడియన్స్‌ను బాగానే కంగారు పెట్టారు నందితా శ్వేతా. ఇప్పుడామె ‘ప్రేమకథా చిత్రమ్ 2’ సినిమాలో నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘బ్యాక్ టు ఫియర్’ అనేది ఉపశీర్షిక. హరి కిషన్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నానీ ముఖ్య తారలుగా నటించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన నందిత లుక్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది.
ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ‘దేవి 2’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 2016లో వచ్చిన దేవి (తెలుగులో ‘అభినేత్రి’) సినిమాకు ఇది సీక్వెల్. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నందితా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ప్రభుదేవా, తమన్నా ముఖ్య తారలు. తమిళంలో ‘నర్మద’ అనే సినిమాకు కమిట్ అయ్యారు నందిత. ఈ సినిమాలో కూడా హారర్ అంశాలు ఉంటాయని టాక్. మరి.. ఈ మూడు సినిమాలతో నందితా ఆడియన్స్‌కు ఎక్స్‌ట్రా ఫియర్ ఇస్తారా? వెయిట్ అండ్ సీ.
నందితా శ్వేతా
హీరోలు కూడా హారర్ జానర్‌పై దృష్టిపెట్టారు. 2017లో ‘గృహం’ సినిమాతో బంపర్‌హిట్ అందుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు ‘అరువమ్’ అనే హారర్ మూవీలో నటిస్తున్నారు. ‘ముని’ సిరీస్ మూవీస్‌తో రాఘవ లారెన్స్ ప్రేక్షకులను బాగా భయపెట్టారు. ఆయన తాజా హారర్ మూవీ ‘కాంచన 3’ (ముని 4) ఏప్రిల్‌లో విడుదల కానుంది. ‘నిను విడని నీడను నేనే’ చిత్రంతో తొలిసారి హారర్ జానర్‌లో నటిస్తున్నారు సందీప్ కిషన్. ‘చీకట్లో చితక్కొట్టుడు’ వంటి చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరిక్షీంచుకోవడానికి రెడీ అవుతున్నాయి.
సిద్ధార్థ్, రాఘవ లారెన్స్
– ముసిమి
హారోయిన్స్
Published Sun, Jan 20 2019 1:44 AM | Last Updated on Sun, Jan 20 2019 1:44 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment