హీరో'ఇన్' | heroines special story in this generation movies | Sakshi
Sakshi News home page

హీరో'ఇన్'

Published Thu, Aug 4 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

హీరో'ఇన్'

హీరో'ఇన్'

మహిళల్లో శక్తి ఉంటుందని మనమే కాదు...
మన పూర్వులే కాదు...
పూర్వుల పూర్వులు కూడా గుర్తించారు. అందుకే, మనకు అంతమంది దేవతలు!
అలాగే, సినిమా ఇండస్ట్రీ కూడా మహిళలకు పెద్ద ‘పీఠం’ వేస్తోంది.
కొత్త ట్రెండ్‌లో హీరోయిన్‌లే ఇన్!
ఈ సినిమాల్లో హీరో అవుట్... క్లీన్‌బౌల్డ్!!

అనుష్క: ఇవాళ చాలా సినిమాల్లో హీరోలకు మించిన హీరో(యిన్) - ఈ బెంగుళూరు భామ. గ్లామర్ హీరోయిన్‌గా మొదలై ఆ పాత్రలే చేస్తూ వస్తున్న ఈ యోగా టీచర్ కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ ‘అరుంధతి’. ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాకు తెలుగులోనే కాదు... తమిళంలోని ఆడియన్స్ క్లాప్స్ పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద కాసులు కురిశాయి. అప్పటికే సౌందర్య మరణంతో కొత్త చిరునామా వెతుక్కుంటున్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కొత్త కేరాఫ్ అడ్రస్ - అనుష్క అయ్యారు. అప్పటి నుంచి ‘పంచాక్షరి’, లేటెస్ట్ ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’ దాకా కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందంటే, అనుష్క కాల్షీట్లకి యమ డిమాండ్!

రాబోయే చిత్రం: అశోక్ దర్శకత్వంలో తయారవుతున్న ‘భాగమతి’. పేరు చూడగానే ఇదేదో గోల్కొండ నవాబుల కాలం నాటి చారిత్రక కథ అనుకుంటే పొరపాటే! ఇది అచ్చమైన సోషల్ ఫిల్మ్. కథ అంతా హీరోయిన్ పాత్ర చుట్టూరానే తిరుగుతుందని దర్శక, రచయిత, ‘పిల్ల జమీందార్’ ఫేమ్ అశోక్ వివరించారు.

 నయనతార: సినిమా సినిమాకీ గ్లామరస్‌గా కనిపించాలని హీరోయిన్లు అనుకోవడం సహజం. అందుకే ఎప్పటికప్పుడు మేకోవర్ అవుతూ ఉంటారు. అయితే ఈ రేంజ్‌లో కూడా మేకోవర్ కాగలరా? అని చాలామంది ఆశ్చర్యపోయేలా చేశారు నయనతార. ‘చంద్రముఖి’లో కనిపించిన నయనతారేనా ఈవిడ అని ‘బాస్’ సినిమాలో నయనను చూసినవాళ్లు అనుకున్నారు. ఆ సినిమా నుంచి ఆ మధ్య విడుదలైన హిందీ ‘కహానీ’కి దక్షిణాది రీమేక్ ‘అనామిక’ వరకూ నయనతార మేకోవర్ అవుతూ వచ్చారు. సినిమా సినిమాకీ రెట్టింపు అందంతో కనిపిస్తున్నారామె. ఇటు తెలుగు, అటు తమిళంలో తిరుగులేని తార అనిపించేసుకుని, చివరకు లేడీ ఓరియంటెడ్ మూవీస్ బాక్సాఫీస్ భారం మొత్తాన్నీ తన భుజాలపై మోసేయడానికి రెడీ అన్నారు. కమర్షియల్ సక్సెస్ మాట ఎలా ఉన్నా, హిందీ ఒరిజినల్‌లో విద్యాబాలన్ లాగా తెలుగు రీమేక్ శేఖర్ కమ్ముల ‘అనామిక’లో టైటిల్ రోల్‌కి న్యాయం చేశారు నయనతార. ఆ తర్వాత ‘మాయ’ అనే నాయికా ప్రధానమైన హార్రర్ ఫిల్మ్‌లో నటించారు. ఆ సినిమా హిట్‌తో ఈ కేరళ కుట్టిని మనసులో పెట్టుకొని చాలామంది హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నారు.

రాబోయే చిత్రం: హారర్ నేపథ్యంలో సాగే ‘మాయ’లో నయనతార నటన చూసిన తమిళ దర్శకుడు దాస్ రామసామి నయనతారను దృష్టిలో పెట్టుకుని ఓ హారర్ బేస్డ్ స్టోరీ రెడీ చేసుకున్నారు. తమిళంలో ‘దొర’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని సీన్స్‌లో నయనతార చాలా మాస్‌గా కనిపిస్తారట. అందుకోసం నయనతార మళ్ళీ మేకోవర్ అయ్యారు. సెట్స్‌పై ఉన్న ఈ చిత్రంలో కారుకి కీలక పాత్ర ఉంది. నయనతార పాత్రను ఆ కారు వెంటాడుతుందట. విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న హరీశ్ ఉత్తమన్ ఇందులో మరో కీలకపాత్రధారి.

 అంజలి: ఈ కోనసీమ అమ్మాయి ‘జర్నీ’, ‘అంగాడి తెరు’ (తెలుగులో ‘షాపింగ్ మాల్’) లాంటి సినిమాలతో తమి ళంలో అభినయానికి పెట్టింది పేరు అయింది. డీ-గ్లామరైజ్డ్ హీరోయిన్ పాత్రలైనా, మొత్తం తన చుట్టూ తిరిగే కథలకు ప్రాణం పోసింది. రెండేళ్ళ క్రితం వచ్చిన హిట్ హార్రర్ - కామెడీ ‘గీతాంజలి’ లాంటివి తెలుగులోనూ ఫిమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్‌కు అంజలిని కొత్త ఛాయిస్‌గా మార్చాయి. ఆ తరువాత ఆమె దగ్గరికి ఎన్ని స్త్రీ ప్రధాన చిత్రాల స్క్రిప్ట్‌లు వచ్చాయంటే, చివరకి చాలావాటికి అంజలి నో చెప్పాల్సి వచ్చింది.

రాబోయే చిత్రాలు: తెలుగులో తయారవుతున్న తాజా సైకో - యాక్షన్ థ్రిల్లర్ ‘చిత్రాంగద’ (తమి ళంలో టైటిల్ ‘యార్ నీ’)లో హీరో (యిన్) అంజలి యే! అశోక్ డెరైక్షన్‌లో చాలా కాలంగా చిత్రీకరణలో ఉంది. ప్రస్తుతం గ్రాఫిక్స్ పనుల్లో ఉన్న ఈ సినిమాను అందమైన విదేశీ లొకేషన్స్‌లో తీశారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాక ముందే తమిళంలో మరో లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ (‘కాన్బదు పొయ్’ - చూసేదంతా అబద్ధమని అర్థం)లో నటించడానికి కూడా అంజలి సంతకం పెట్టేశారు. ఈ చిత్రాల్లో హీరో పాత్రలు నావ్‌ు కే వాస్తేనే. పాత్రధారులూ పెద్ద నటులు కాదనేది గమనార్హం. సినిమా అంతా హీరోయిన్ చుట్టూరానే తిరిగే స్క్రిప్ట్ అనడానికి అంత కన్నా ఇంకేం నిదర్శనం కావాలి.

 త్రిష: సినీ రంగంలోకి వచ్చి పుష్కరం దాటినా, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా కనిపించడం తమిళ పొన్ను త్రిషా కృష్ణన్ స్పెషాలిటీ. వయసు పెరగడం కొన్నేళ్ళ క్రితమే ఆగిపోయిం దనిపించే ఈ హీరోయిన్‌కు ప్రేమకథలు, గ్లామర్ పాత్రలు కొట్టింది పిండి. జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పు ముడిచినా అందమే అన్నట్లు, ఇటీవల హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలొస్తుంటే సై అంటున్నారు. నిరుడు తమిళంలో వచ్చిన హార్రర్ చిత్రం ‘అరన్మణై-2’ (తెలుగులో ‘కళావతి’), గత నెల రిలీజైన తెలుగు - తమిళ ద్విభాషా హార్రర్ - కామెడీ ‘నాయకి’ త్రిషలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాయి.

రాబోయే చిత్రాలు: ఆ మధ్య రెండేళ్ళ క్రితం ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా తమిళంలో ‘రమ్’ (రంభ - ఊర్వశి - మేనక) అనే సినిమాకు సై అన్నారు త్రిష. ఆ సినిమాలో వెరైటీ ఫైట్లు చేయడానికీ సిద్ధపడ్డారు. కానీ ఏమైందో ఏమో కానీ, ఆఖరు క్షణంలో ఆ ప్రాజెక్ట్ అర్ధంతరంగా ఆగిపోయింది. అయితే, ‘అరన్మణై-2’, ‘నాయకి’ తర్వాత జయా పజయాలతో సంబంధం లేకుండా కొత్త కథల వైపు త్రిష మొగ్గారని చెన్నై వర్గాల భోగట్టా.  అందుకు తగ్గట్లే తమిళంలో ఆర్. మాధేష్ దర్శకత్వంలో ‘మోహిని’ అనే హార్రర్ సినిమాలో ఆమె నటిస్తున్నారు. రెండు నెలల క్రితమే షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని ప్రధానంగా లండన్ పరిసరాల్లో చిత్రీకరిస్తున్నారు. టైటిల్ రోల్ పోషిస్తున్న త్రిష ఈ సినిమా స్క్రిప్ట్ గురించి పెద్దగా చెప్పట్లేదు కానీ, లీసెస్టర్ స్క్వేర్, టవర్ బ్రిడ్‌‌జ లాంటి ప్రసిద్ధ లండన్ లొకేషన్లలో నెల రోజుల పైగా షూటింగ్ జరుగుతుంటే, ఉత్సాహంగా ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టారు.

 తమన్నా: తెలుగులో పరిచయమై, తమిళం, హిందీల్లో కూడా జెండా ఎగరేసిన ఈ పంజాబీ పిల్ల గ్లామర్‌తో పాటు కొత్త తరహా పాత్రలకూ ఎప్పుడూ సిద్ధం అంటుంటారు. తెలుగులో మాట్లాడడమే కాక, పాత్రకు తప్పనిసరి అంటే సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనే దశకు కూడా వచ్చేశారు. బెస్ట్ డ్యాన్సర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ భాటియా వంశపు యువరాణి ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ఓ... యస్ అనేస్తున్నారు.

రాబోయే చిత్రాలు: తమిళ దర్శకుడు ఎల్. విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వస్తున్న ‘అభినేత్రి’ సినిమా అచ్చంగా మహిళా ప్రధాన చిత్రమే. నేత చీర కట్టుకొని, నుదుటన బొట్టు, మెడలో పువ్వులు పెట్టుకొని పాత కాలానికి చెందిన అమ్మాయిగా, మరోపక్క అధునాతనమైన దుస్తుల్లో నవ నాగరిక యువతిగా రెండు షేడ్‌‌స ఉన్న పాత్రల్లో తమన్నా ఫస్ట్ లుక్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఈ చిత్రంలో మరో ముఖ్యపాత్ర ధరిస్తున్న ప్రభుదేవా సైతం ఈ మహిళా ప్రధాన చిత్రం కొత్తగా ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ త్రిభాషా చిత్రం గనక హిట్టయితే, మరో హీరో(యిన్) మనకు దొరికేసినట్లే.

 మంచు లక్ష్మీప్రసన్న : సినిమా కుటుంబంలో పుట్టి, ఆ వాతావరణంలో పెరిగిన మంచు వారి అమ్మాయికి జీవితం లోనూ, సినీ జీవితంలోనూ ఎప్పటికప్పుడు కొత్తదనం ఇష్టం. ఆమె ప్రయాణమే అందుకు సాక్ష్యం. హాలీవుడ్‌లో టీవీ షో లతో మొదలుపెట్టి తెలుగు సీమలో టీవీ షోల వరకు ఎప్పటి కప్పుడు కొత్తదనంతో విస్తరించిన కెరీర్ ఆమెది. తొలి చిత్రం ‘అనగనగా ఒక ధీరుడు’లో ప్రతినాయకి ఐరేంద్రి పాత్రతోనే అందరినీ ఆకట్టుకున్న ఘనత లక్ష్మి సొంతం.
రాబోయే చిత్రం: ఇప్పటికే ‘చందమామ కథలు’, ‘బుడుగు’, ‘దొంగాట’ చిత్రాల్లో విభిన్న తరహా పాత్రలు పోషించారు మంచు లక్ష్మి. తాజాగా ‘లక్ష్మీ బాంబ్’ అనే విభిన్న తరహా చిత్రంలో కనిపిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ 80 శాతం పూర్తయింది. థ్రిల్లింగ్ అంశాలున్న పక్కా కామెడీ ఎంటర్‌టైనర్ ఈ చిత్రం. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ ఇందులో ఆమెను డైనమిక్‌గా చూపిస్తున్నారు. ‘‘ఈ చిత్రకథ ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. కొత్తగా ఉండాలని ఇందులో జడ్జిగా చేశా. ఈ మూవీలో నేను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ఆకట్టుకుంటాయి’’ అని లక్ష్మి అన్నారు. ‘‘హిందీ, ఇతర భాషల్లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు బాగా మార్కెట్ చేస్తున్నాయి. తెలుగులోనూ అలాంటి మార్కెట్ రావాలని చేస్తున్న చిత్రమిది’’ అని లక్ష్మి వ్యాఖ్యానించారు.

ఆ మార్కెట్ రావాలే కానీ, ఇలాంటివి మరిన్ని రావడం ఖాయం.
సినీఫీల్డ్‌లో సర్వసాధారణంగా అందరూ చెప్పేది... లింగ వివక్ష సమస్య. సెట్‌లో పనిలో, వేతనాల్లో వివక్ష మాటెలా ఉన్నా, సినిమా సక్సెస్‌కు స్క్రిప్ట్‌లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం కీలకమని దర్శక, నిర్మాతలకూ బాగా తెలుసు. అప్పటి సావిత్రి, జమున తరం నుంచి జయప్రద వరకు చాలామంది హీరోయిన్‌లు మహిళా ప్రధాన చిత్రాల్లో మెప్పించారు. విజయశాంతి, నిన్నటి సౌందర్య బాక్సాఫీస్‌ను మెరిపించారు. ‘అంతులేని కథ’, ‘కర్తవ్యం’ లాంటి ఎన్నో హిట్లే అందుకు ఉదా  హరణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement