బాక్సాఫీస్ భామలు
Published Tue, Dec 10 2013 3:55 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
కోలీవుడ్‌లో 2013లో నూతన తారల తాకిడి అధికంగానే ఉంది. వారిలో విజయాన్ని సొంతం చేసుకుని నిలదొక్కుకున్నవారి సంఖ్య చాలా తక్కువ. చాలా మంది కొత్త హీరోయిన్లు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగయ్యారు. అయితే సీనియర్ హీరోయిన్లు నయనతార, అనుష్క, కాజల్ అగర్వాల్, హన్సిక, త్రిష, అమలాపాల్ వంటివారు బాక్సాఫీస్ బద్దలుకొట్టి తమ స్థానాలు పదిలం చేసుకున్నారు.
తుపాకి పేలింది
నటి కాజల్ అగర్వాల్ కోలీవుడ్‌లో సక్సెస్ కొట్టాలన్న తన ఆశను తుపాకి నెరవేర్చింది. విజయ్ సరసన నటించిన ఈ చిత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. వంద కోట్ల క్లబ్‌లో తుపాకి చేరడం విశేషం. ఇటీవల విడుదలైన అళగురాజా కాజల్‌ను నిరుత్సాహపరిచినా మరో సారి విజయ్‌తో జత కట్టిన జిల్లా చిత్రంపై కాజల్ భారీ ఆశలనే పెట్టుకున్నారు. ఈ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది.
అమలాపాల్ ఓకే
మైనాతో హిట్ పల్లకి ఎక్కిన నటి అమలాపాల్. ఈ ఏడాది ఈ మలయాళి కుట్టికి అంత ఆశాజనకంగా లేకపోయినా చేతిలో రెండు మూడు చిత్రాలున్నాయి. విజయ్ సరసన నటించిన తలైవా చిత్రం అమలాపాల్ కలల్ని కల్లలు చేసింది. ప్రస్తుతం జయంరవి కి జంటగా నిమిర్న్‌దునిల్, ధనుష్ సరసన వేలై ఇల్లాద పట్టదారి చిత్రాలతోపాటు మలయాళంలో ఒక చిత్రం చేస్తున్నారు. ఇక నటి త్రిషకు సమర్ చిత్రం పరవాలేదనిపించినా ప్రస్తుతం జీవాతో ఎండ్రెండ్రుం పున్నగై, జయం రవికు జంటగా భూలోకం చిత్రాలు చేస్తున్నారు. వీటితోపాటు రమ్ అనే ద్విభాషా చిత్రంలోనూ త్రిష నటిస్తూ బిజీగా ఉన్నారు. నటి తాప్సీకి ఆరంభం ఆనందాన్నిచ్చినా అవకాశాలు మాత్రం దరిచేరడం లేదు. తమన్నా, ప్రియామణి, సమంత చిత్రాలు ఈ ఏడాది ఒకటి కూడా విడుదలకాలేదు. అయితే కొంత గ్యాప్ తరువాత తమన్న తమిళంలో అజిత్ సరసన నటించిన వీరం సంక్రాంతి బరిలో దిగుతోంది. ఈ చిత్రం ఆమె తల రాతను మారుస్తుందా అన్నది చూడాలి. ఇక ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్న వర్తమాన తారలు లక్ష్మీ మీనన్, శ్రీదివ్య తదితరుల కెరీర్ ఆశాజనకంగా సాగుతోంది.
భారీ చిత్రాల అనుష్క
జయాపజయాలను పక్కన పెడితే నటి అనుష్క హవా కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఏడాది ఈ క్రేజీ హీరోయిన్ నటించిన అలెక్స్, పాండియన్, సింగం-2, ఇరండామ్ ఉలగం చిత్రాలు విడుదలయ్యాయి. వీటిలో సింగం-2 వసూళ్ల వర్షం కురిపిం చగా మిగిలిన రెండు నిరాశపరచాయి. ప్రస్తుతం అనుష్క తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలు రుద్రమాదేవి, బాహుబలిలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అనుష్క కూడా వంద కోట్ల చిత్రాల హీరోయిన్‌గా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.
హన్సిక జోరు
ఈ ఏడాది మరో సంచలన నటిగా పేరుగాంచిన హన్సిక అత్యధిక చిత్రాలను కైవసం చేసుకుంది. తీయవేలై సెయ్యనుమ్ కుమారు చిత్రంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హన్సిక సింగం-2 సక్సెస్‌ను షేర్ చేసుకున్నారు. కార్తీ సరసన నటించిన బిరియాని ఈ నెల 20న తెరపైకి రానుంది. కాగా వాలు, అరణ్మణై, వేట్టైమన్నన్, మాన్ కరాటే, ఉయిరే ఉయిరే తదితర ఏడు చిత్రాలు ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. నటుడు శింబుతో ప్రేమ బ్రేక్ అప్ అయినట్లు సమాచారం. ఏదేమయినా నటిగా హన్సిక మార్కెట్‌కు ఏ మాత్రం డోకా లేదన్నది నిజం.
నయన నెంబర్ వన్
నటి నయనతార నెంబర్ వన్ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్నారు. తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ప్రేమ వ్యవహారం కారణంగా ఏడాదికి పైగా నటనకు దూరంగా ఉండి రీఎంట్రీ ఇచ్చిన తరువాత హీరోయిన్‌గా విజయాలను సొంతం చేసుకున్నారు. రీఎంట్రీ తరువాత ఈ బ్యూటీకి తొలి విజయానందాన్ని అందించిన చిత్రం రాజారాణి. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయం సాధించడంతోపాటు నటిగా మరో అడుగు ముందుకేసింది. ఆ తరువాత విడుదలైన ఆరంభం సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో నయనతారకు అభిమానుల గుండెల్లో స్థానం చెక్కు చెదరలేదని స్పష్టమైంది.
ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ అనామిక అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె గర్భిణిగా నటించడం విశేషం. ఇది హిందీ చిత్రం కహాని కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. హిందీలో విద్యాబాలన్ నటించిన పాత్రను నయనతార పోషిస్తున్నారు. చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెరపైకి రానున్నట్లు సమాచారం. యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ పక్కన రొమాంటిక్ పాత్రలో నటిస్తున్నారు. మాజీ ప్రియుడు శింబుతో జతకట్టిన చిత్రం ప్రారంభమైంది. టాలీవుడ్ నటుడు గోపిచంద్ హీరోగా తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రంతోపాటు మరో రెండు నూతన చిత్రాల్లో నటిస్తూ నయన బిజీ హీరోయిన్‌గా 2014లోకి అడుగుపెట్టనున్నారు.
Advertisement
Advertisement