అభిమాని ఫోన్ విసిరి కొట్టిన సల్మాన్ ఖాన్!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అభిమాని చేతిలోని ఫోన్ విసిరి మీడియాలో దృష్టిని ఆకర్షించాడు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ ను సల్మాన్ ఖాన్ పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రిలో సల్మాన్ కనిపించగానే ఆతృతతో ఫోన్ లో బంధించడానికి ప్రయత్నించిన అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అంతేకాక అభిమాని చేతిలోని ఫోన్ తీసుకుని విసిరికొట్టినట్టు బాలీవుడ్ కు చెందిన ఓ వీడియో మ్యాగజైన్ కథనాన్ని వెల్లడించింది. అనుకోని పరిణామంతో ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది, సందర్శకులతోపాటు అభిమాని కూడా బిత్తరపోయాడట. గతంలో కూడా పలు వివాదాల్లో సల్మాన్ ఇరుక్కున్న సంగతి తెలిసిందే.