బెక్కెం వేణుగోపాల్
‘‘కంటెంట్ బాగుంటే సినిమాను ప్రేక్షకులు హిట్ చేస్తున్నారు. కథ నచ్చి ‘హుషారు’ చిత్రం చేయడానికి ఒప్పుకున్నాను. ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. తేజస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, దక్ష నాగర్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘హుషారు’. రియాజ్ మరో నిర్మాత. ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘‘ఎక్కువగా డబ్బు సంపాదించడమో, మంచి జీతంతో ఉద్యోగంలో సెటిలై పోవడమో కాదు లైఫ్ అంటే... మనకు నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయాలి.
మంచి జ్ఞాపకాలతో జీవితం నిండిపోవాలి అనుకునే నలుగురు స్నేహితుల చుట్టూ సాగే యూత్‌ఫుల్ చిత్రమిది. కాలేజీ నుంచి గెంటివేయబడ్డ ఆ నలుగురు స్నేహితులు లైఫ్ అనే ఎగ్జామ్‌లో ఎలా పాస్ అయ్యారన్నదే చిత్రకథ. ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. హర్ష చాలా జాగ్రత్తగా తెరకెక్కించారు. డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘మేజర్ షూటింగ్ హైదరాబాద్‌లో జరిపాం. కేరళలో ఓ సాంగ్ షూట్ చేశాం. ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ రథన్ మంచి సంగీతం అందించారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన ‘ఉండిపోరాదే..’ సాంగ్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో హీరోలు బీరు తయారు చేస్తారు. ఆ టైమ్‌లో వచ్చే బిట్ సాంగ్ హైలైట్‌గా ఉంటుంది. హాస్యనటుడు రాహుల్ రామకృష్ణ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే ‘హుషారు’ టీమ్ బస్సు యాత్ర మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రేక్షకులను కలుస్తాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment