తాతయ్య ఫొటో చూడగానే ఓకే చెప్పేశాను - సుమంత్
తాతయ్య ఫొటో చూడగానే ఓకే చెప్పేశాను - సుమంత్
Published Mon, Jan 27 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
‘‘ ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’లో తొలిసారి కామెడీ పాత్ర చేశాను. సుమంత్ కామెడీ కూడా బాగా చేయగలడు అని ఈ చిత్రం నిరూపించింది. నటునిగా నాకెంతో సంతృప్తి కలిగిస్తున్న విషయం ఇది’’ అని సుమంత్ అన్నారు. ఆయన కథానాయకునిగా చంద్రసిద్దార్థ్ దర్శకత్వంలో పూదోట సుధీర్‌కుమార్ నిర్మించిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సుమంత్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో ఆడవేషం వేయాలని చంద్రసిద్దార్థ్ చెప్పినప్పుడు కొంచెం ఆలోచించాను.
ఇంటికెళ్లగానే... తొలినాళ్లలో తాతయ్య ఆడవేషం వేసిన నిలువెత్తు ఫొటో కనిపించింది. ఆ ఫొటో చూడగానే... ఇక ఆలోచించకుండా చంద్రసిద్దార్థ్‌కి ‘ఓకే’ చెప్పేశాను. రియల్ లైఫ్‌లో నా కేరక్టర్‌కి పూర్తి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో నేను చేశాను. నిజంగా ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన పాత్ర ఇది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అని చెప్పారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి ప్రేమకథ ఇదని, నేటి యువతరం మనోభావాలను ఇందులో చూపించామని చంద్రసిద్దార్థ్ అన్నారు. ‘‘వ్యాపారవేత్తగా ఇక్కడ కొన్ని రోజులు, విదేశాల్లో కొన్ని రోజులు ఉండే నా జీవితానికి ఈ కథ చాలా దగ్గర. నిర్మాతగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సినిమా ఇది’’ అని నిర్మాత అన్నారు. కథానాయిక పింకీ సావిక, కథారచయిత ఎస్.ఎస్.కాంచి, గేయరచయిత చైతన్యప్రసాద్ తదితరులు కూడా మాట్లాడారు.
Advertisement
Advertisement