
నేను ఫుల్ హ్యాపీ!
‘‘గత ఏడాది విభిన్న పాత్రలు చాలా చేశాను. చందమామ కథలు, పరంపర, దృశ్యం, చిన్నదాన నీకోసం తదితర చిత్రాల్లో చేసిన పాత్రలు నాకు మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా ‘పరంపర’ చిత్రానికి అంతర్జాతీయ చిత్రోత్సవంలో అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ ఏడాది కూడా అద్భుతమైన పాత్రలు చేస్తున్నాను’’ అని నరేశ్ చెప్పారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, ఇతర విశేషాల గురించి నరేశ్ మాట్లాడుతూ -‘‘హీరోగా ‘నాలుగు స్థంభాలాట’తో నా కెరీర్ ఆరంభమైంది.
కథానాయకునిగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేశాను. కారెక్టర్ నటుడిగా కూడా ఇప్పుడు ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయడం ఆనందంగా ఉంది. ఆరేళ్ల క్రితం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించాను. బిజీ బిజీగా సినిమాలు చేస్తున్నాను. మొత్తం మీద నా కెరీర్ చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. ప్రస్తుతానికి రాజకీయాల గురించి ఆలోచించడంలేదని చెబుతూ -‘‘అనంతపురంలో ‘కళాకారుల ఐక్య వేదిక’ నిర్వహిస్తున్నాను. సినిమా కళాకరులనే కాకుండా వివిధ వృత్తుల్లో నిరాదరణకు గురైన వారికి ఈ సంస్థ ద్వారా సహాయం చేస్తున్నాను. ఆ విధంగా నాకు ఆత్మసంతృప్తి లభిస్తోంది’’ అని చెప్పారు.