
వయసొచ్చే కొద్దీ పాత్రలను పండించే అవకాశం తక్కువమంది నటులకే వస్తుంది మన దగ్గర. హిందీలో అమితాబ్, మిథున్ చక్రవర్తి వంటి హీరోలు తమ హీరో కెరీర్ ముగిశాక భిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. నరేశ్ హీరోగా కెరీర్ ముగిశాక కేరక్టర్ ఆర్టిస్టుగా మొదలెట్టిన రెండోదశ అంత సఫలం కాలేదు. కాని మూడవ దశ నుంచి ఆయనకు బంగారు దశ పట్టింది. నరేశ్ నటుడిగా ఇప్పుడు తెలుగులో విలువైన నటుడిగా ఎదిగారు.
దర్శకుడు జంధ్యాల తీర్చిదిద్దిన నరేశ్ కామెడీ హీరోగా యాక్షన్ హీరోగా కూడా సినిమాలు చేశారు. అయితే కామెడీ సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యాయి. ‘మనసు–మమత’,‘పోలీసు భార్య’ వంటి సెంటిమెంట్ సినిమాలు పెద్దస్థాయి లో హిట్ అయ్యాయి. ‘ప్రేమ అండ్ కో’తో హీరో గా విరామం ఇచ్చి ‘అల్లరి రాముడు’ (2002)తో కేరెక్టర్ యాక్టర్‌గా మారాడాయన. అయితే ఆ సినిమా అనుకున్నంత సఫలం కాకపోవడంతో తగినన్ని రోల్స్ రాలేదు. అయితే ఆయన ‘మీ శ్రేయోభిలాషి’ సినిమాతో తనలో ఉన్న భిన్నమైన నటుణ్ణి బయటకు తెచ్చారు. ఆ ఒక్క సినిమాతో నరేష్ దశ మారింది. ఆ తర్వాత ‘అందరి బంధువయా’, ‘చందమామ కథలు’ సినిమాతో ఆయన పూర్తిస్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా తన హవాను మొదలెట్టారు. ఏ కేరెక్టర్ ఇచ్చినా ఆ కేరెక్టర్‌కు తగిన ఆహార్యం, మాట, బాడీ లాంగ్వేజ్‌లోకి మారిపోతూ ఇన్‌హిబిషన్స్ లేకుండా తన గత ఇమేజ్‌ను పట్టించుకోకుండా పాత్రకే విలువ ఇవ్వడం వల్ల ఆయనకు ఈ విజయం వచ్చింది.
‘భలే భలే మగాడివోయ్’, ‘గుంటూరు టాకీస్’, ‘అ..ఆ’, ‘శతమానం భవతి’, ‘రంగస్థలం’... ఇలా నరేశ్ భిన్న భావోద్వేగాలున్న పాత్రలను పోషించారు. అన్నింటికి మించి ఇటీవల చేసిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలో నరేశ్ చేసిన ఎముకల డాక్టర్ పాత్ర ఆయన పాలలో నీటిలా కలిసిపోయే నటనా పటిమను చూపింది. సినిమా మొత్తం ఉండే ఈ పాత్ర అందులో హీరోగా వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రతీకారం తీర్చుకునేందుకు సాయం చేస్తుంది. అరకు ప్రాంతపు సిసలైన మనిషిగా నరేశ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నరేశ్ ఇప్పుడు 61 ఏళ్లు పూర్తి చేసుకొని 62లోకి అడుగుపెడుతున్నారు. మున్ముందు ఆయన మరిన్ని గొప్ప పాత్రలు తప్పక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment