ఆయన చెప్పింది ఇప్పటికీ పాటిస్తున్నాను -శ్రీహరి.
ఆయన చెప్పింది ఇప్పటికీ పాటిస్తున్నాను -శ్రీహరి.
Published Thu, Aug 15 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
‘‘పరిశ్రమలో నిలదొక్కుకోవాలనుకుంటే ముందు వినడం నేర్చుకోవాలి. తామరాకు మీద నీటిబొట్టులా ఉండటం నేర్చుకోవాలి. అందరితో కలిసి వెళితేనే ఇక్కడ పదికాలాల పాటు మనగలం’’ అని చెప్పారు డా. శ్రీహరి. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీహరి మాట్లాడుతూ -‘‘నాకు నటన తప్ప మరొకటి తెలీదు. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోవడం అస్సలు తెలీదు. ఈ రెండు లక్షణాలే నన్ను పరిశ్రమలో నిలబెట్టాయి. ఏదో సాధించాలని కట్టుబట్టలతో మద్రాసు రైలు ఎక్కాను.
మహామహుల సాంగత్యం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఓ సారి సీనియర్ కెమెరామేన్ వీఎస్‌ఆర్ స్వామిగారు నాతో ఓ మాట అన్నారు. ‘వచ్చిన ఏ అవకాశాన్నీ నిర్లక్ష్యం చేయకు. చిన్న సినిమాలో చిన్న పాత్రయినా చేయి. ఎందుకంటే... అక్కడ పనిచేస్తే... నీకు ఇంకో కుటుంబం పరిచయం అవుతుంది. ఆ పరిచయాలే నిన్ను గొప్పవాణ్ణి చేస్తాయి’ అని. ఇప్పటికీ నేను ఆ మాటను పాటిస్తూనే ఉన్నాను. చిత్ర పరిశ్రమలో ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో, చెడిపోవడానికి అంతకంటే ఎక్కువ మార్గాలే ఉన్నాయి. కానీ నేను మాత్రం పాత్రల గురించి తప్ప మరో వాటి గురించి ఆలోచించేవాణ్ణి కాదు. దాసరి నారాయణరావుగారి శిష్యుడు శ్రీహరి చాలా పద్ధతి గలవాడు అనే అందరితో అనిపించుకున్నా.
పరిశ్రమలో ప్రతి ఒక్కరి నమ్మకాన్నీ పొందా’’ అని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల గురించి చెబుతూ -‘‘మళ్లీ ‘తుఫాన్’తో షేర్‌ఖాన్ రిపీట్ అవ్వబోతున్నాడు. ఈ పాత్ర నాకు మళ్లీ మంచి మైలేజ్ ఇస్తుంది’’ అన్నారు. సంజయ్‌దత్‌తో తన అనుభవం గురించి మాట్లాడుతూ -‘‘సంజయ్ గొప్ప నటుడు. సన్నివేశాలన్నీ ముందు నా పైనే తీసేవారు అపూర్వలాఖియా. అది చూసుకొని ఆయన చేసేవారు (నవ్వుతూ). తను ఎంతో స్పోర్టివ్’’ అన్నారు. తన బాలీవుడ్ అరంగేట్రం గురించి చెబుతూ -‘‘ప్రభుదేవా దర్శకత్వంలో ‘రోబో రాజ్‌కుమార్’లో విలన్‌గా చేస్తున్నా. ఓ విధంగా బాలీవుడ్‌లో ఇది నా గ్రాండ్ ఎంట్రీ’’ అన్నారు.
Advertisement