
ఆయనను ఆమెగా చూసి... ఒకటే నవ్వులు
వెండితెరపై వీరోచిత పోరాట దృశ్యాలు చేస్తూ, మగధీర అనిపించుకునే హీరోలు సన్నివేశం డిమాండ్ మేరకు అప్పుడప్పుడు ఆడవేషంలో కూడా కనిపించాల్సి వస్తుంది. ఈ గెటప్ అందరికీ నప్పదు. ముఖ్యంగా మంచి దేహదారుఢ్యం గల సైఫ్ అలీఖాన్ వంటి హీరోలు లేడీ గెటప్ వేసుకుంటే నవ్వు రావడం ఖాయం. ఆయన ఈ గెటప్‌లో కనిపించనున్న సినిమా ‘హమ్ షకల్స్’. ఇటీవల సైఫ్ ఆడ వేషానికి సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.
తన భర్త లేడీ గెటప్ వేసుకుంటున్నాడని తెలిసి కరీనా కపూర్ ఆ షూటింగ్ లొకేషన్‌కి వెళ్లారు. మేకప్ రూమ్‌లో ఈ వేషం వేసుకుని, బయటికొచ్చిన సైఫ్‌ని చూసి కరీనా నవ్వాపుకోలేకపోయారట. పరిసర ప్రాంతాలను మర్చిపోయి తనివి తీరా నవ్వేశారని సమాచారం. ఆ నవ్వుకి కరీనా మొహం ఎర్ర మందారంలా కందిపోయిందని, చూడముచ్చటగా అనిపించిందని చిత్రం బృందం అంటున్నారు. కరీనా అలా నవ్వడం చూసి, మొహం కందగడ్డలా పెట్టుకున్నారట సైఫ్. ఆ తర్వాత విషయాన్ని తేలిగ్గా తీసుకుని, ఆయన కూడా హాయిగా నవ్వేశారట. రేపు ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు కూడా సైఫ్ గెటప్ చూసి, పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారని ఊహించవచ్చు.