
ఆమె బ్యాక్ గ్రౌండ్ చూడలేదు - రామ్ చరణ్
హైదరాబాద్ : 'ఆమెతో ప్రేమలో పడేటప్పుడు ఆమె ఫ్యామిలీని కానీ, బ్యాక్ గ్రౌండ్ని కానీ చూడలేదు.. లెక్కలు చూసుకుని పుట్టేది అసలు ప్రేమే కాదు, నాది అన్ కండిషనల్ లవ్' అని చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్ కి ముఖ్య అతిధిగా హాజరైన అతడు విద్యార్థులతో మాట్లాడుతూ తన ప్రేమకథను చెప్పుకొచ్చాడు. జీవితంలో అతి ముఖ్యమైన ఐదు విషయాలను గురించి వివరిస్తూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. కుటుంబం, చదువు, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ.. చాలా విలువైనవన్నారు. రామ్ చరణ్ నోటి వెంట 'ప్రేమ' అనే మాట రాగానే విద్యార్థులంతా ఉత్సాహంగా ఈలలు వేశారు.
దాంతో రామ్ చరణ్ చిన్న సైజ్ లవ్ గురు అయిపోయారు. ప్రేమలో పడటం అనేది అందరికీ జరిగేదే.. అయితే జీవితం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండాలి, ఏదైనా మన లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఉండకూడదు అంటూ వివరించారు. ఉదాహరణకు నా ప్రేమ కథే తీసుకుంటే.. మల్లారెడ్డి గారు చెప్పినట్లు నేను ఉపాసనను లెక్కలు చూసుకుని ప్రేమించలేదు, అంతస్తు చూసి పెళ్లి చేసుకోలేదు.. మాది నిజమైన ప్రేమ అన్నారు. అంతకు ముందే ఎంపీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకుని జాక్ పాట్ కొట్టారన్నారు. మల్లారెడ్డి కామెంట్ ను సున్నితంగా ఎత్తి చూపుతూనే తన ప్రేమ కథ చెప్పి విద్యార్థులను మెప్పించారు రామ్ చరణ్.
ఏ బంధమైనా లెక్కల మీద నిలబడదని, నిజమైన ప్రేమే బంధాలను నిలబెడుతుందంటూ చరణ్ చెప్పిన మాటలకు విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో చప్పట్లు చరిచారు. అభిమాన తార రాకతో కాలేజీ ఆవరణంతా హంగామా చేశారు విద్యార్థులు.