విలన్‌గా చేయను
Published Sat, Jan 25 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
ఇళయదళపతి వయసు 30 ఏళ్లు అంటే ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది ఆయన సినిమా వయసండి. అంటే విజయ్ సినీ రంగంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారా? అంటే ఇది అక్షరాల నిజం. విజయ్ బాల నటుడిగానే తెరంగేట్రం చేశారు. 1984లో వెట్రి అనే చిత్రం ద్వారా మాస్టర్ విజయ్‌గా నటనకు శ్రీకారం చుట్టిన నేటి సూపర్‌స్టార్ 1992లో నాళయ తీర్పు చిత్రంతో కథా నాయకుడిగా అవతారమెత్తారు. ఆ విధంగా హీరోగా రెండు పుష్కరాలను పూర్తి చేసుకున్న ఇళయదళపతితో చిట్‌చాట్.
మీకు ఎవరు పోటీ అని భావిస్తున్నారు?
ప్రేక్షకుల ప్రశంసలు పొంది విజయాన్ని సాధించిన చిత్రాలనే నేను పోటీగా భావిస్తాను.
బయట సీరియస్‌గా ఉంటూ సినిమాల్లో మాత్రం నవ్విస్తుంటారు?
నాకు హాస్యం అంటే ఇష్టమే. జాలీగా మాట్లాడటం, ఆట పట్టించడం లాంటి అంశాలను ఎంజాయ్ చేస్తాను. ఎప్పటి నుంచో ఇప్పటి వరకు సరదాగా ఉండే నలుగురు స్నేహితులు నాతోనే ఉన్నారు. అదే విధంగా నా అభిమానులను నవ్వించడానికి నేను హాస్య సన్నివేశాల్లో నటిస్తుంటాను.
విలన్‌గా నటించాలనే కోరిక ఉందా?
ఇంతకుముందు ప్రియముడన్ చిత్రం లో ప్రేయసి కోసం హత్యలు చేసే పాత్రను పోషించాను. ఆ చిత్రం చూసిన మా అమ్మ ఇకపై అలాంటి పాత్రలు చేయవద్దని చెప్పారు. అందువలనే నెగటివ్ పాత్రలకు దూరంగా ఉంటున్నాను.
మీకు మానసిక గురువు ఎవరు?
ఇంకెవరు మా నాన్నే.
ప్రేయసి ఉందా?
ఒకటి సినిమా, రెండు నా భార్య.
మీకు అసూయ కలిగించే నటుడెవరు?
కమల్ హాసన్.
ఒక చిత్ర జయాపజయాలను నిర్ణయించేదెవరు?
కథ, దర్శకత్వం
దర్శకత్వం వహిస్తారా?
దర్శకత్వం అంటే అందరి హక్కులను పర్యవేక్షిస్తూ చేసేది. అంత సహనం, సమయం నాకిప్పుడు లేవు. ప్రస్తుతానికి దర్శకత్వం అనేది నాకు సరిపడదు.
మీరు తరచూ విదేశీయానం చేసే ప్రదేశం?
లండన్.
మీరు సీఎం అయితే తొలిసారిగా జారీ చేసే ఉత్తర్వులు?
ఇలాంటి అడ్డదిడ్డ ప్రశ్నలు వేసే వాళ్లకు ఆరు నెలలు జైలులో పెట్టాలని ఉత్తర్వులు జారీ చేస్తాను.
మిమ్మల్ని ఏడిపించిన సంఘటన ఉందా?
నాకు ఏడవడం అన్నా, ఏడ్చేవాళ్లన్నా నచ్చరు. నేను ఒకే ఒక్కసారి కంటతడిపెట్టాను. అది నా చెల్లెలు విద్య ఈ లోకాన్ని విడిచి పోయినప్పుడు.
కడుపుబ్బ నవ్విన సంఘటన?
బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో ఆర్య, సంతానం నటించిన హాస్య సన్నివేశాలు చూసి కడుపుబ్బ నవ్వాను. ముఖ్యంగా ఆ చిత్రంలో సంతానం ఒక్కొక్కరు పదిమంది స్నేహితులతో సంతోషంగా ఉంటుంటే. నేను ఒక్క స్నేహితుడితో పడుతున్న బాధలు ఉన్నాయే అనే సంభాషణలు చెప్పే సన్నివేశాన్ని చాలా ఎంజాయ్ చేశాను.
జయలలిత, కరుణానిధిలలో మీకు నచ్చిన విషయం?
జయలలితలో నచ్చిన విషయం ఆమె ధైర్యం. కరుణానిధిలో నచ్చిన అంశం సాహిత్యం.
Advertisement