నన్ను 'చెంచా' అన్నా ఏం బాధలేదు...
న్యూఢిల్లీ: దేశం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి తనను 'చెంచా' అని పిలిచినా ఏమాత్రం పట్టించుకోనని బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఓ ఛానల్ కి ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. స్కూళ్లలో లాల్ బహదుర్ శాస్త్రి, ఇతర నేతలకు జై కొడుతూ నినాదాలు చేస్తుంటారు కదా... మరి ఎందుకు ప్రధాని మోదీకి ఆ విధంగా జై కొట్టడం లేదని ప్రశ్నించారు. అసలు సమస్య ఏంటో తనకు అర్థం కావడం లేదన్నాడు. దేశ ప్రతిష్టను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేస్తున్న వ్యక్తిని గౌరవించుకోవడం మన పని అని పేర్కొన్నారు.
మహిళల టాయిలెట్లు, వారి సమస్యలపై ఇప్పటివరకు ఏ ప్రధాని నోరువిప్పలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. కొందరు తనను ప్రధాని మోదీకి 'చెంచా' అని విమర్శిస్తున్నారని చెప్పారు. అయితే తాను మోదీకి మాత్రమే కాదు, బిగ్ బి అమితాబ్ బచన్, దిలీప్ కుమార్ లకు కూడా చెంచా అంటూ తనపై విమర్శల్ని తిప్పికొట్టారు. దేశం కోసం తనను ఆలోచించేలా చేసిన వ్యక్తి మోదీ అని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలోనైనా చేరేందుకు తగిన నిర్ణయం తీసుకుంటానన్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని తీవ్రంగా విమర్శించారు. రాజకీయాలపై అనాసక్తి ఉన్న నేత అంటూ అనుపమ్ ఖేర్ వ్యాఖ్యలు చేశారు.