ముంబై: క్యాన్సర్ వల్లనే తనకు జీవితం విలువ తెలిసొచ్చిందని, ఇప్పటి వరకు తాను సంపాదించినదాంట్లో కొంత భాగాన్ని క్యాన్సర్ పరిశోధనలకు వెచ్చించడం, తన సినిమా కెరీర్‌పై దృష్టిని కేంద్రీకరించడమే తన లక్ష్యమని గత ఆరేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న కెనడియన్-ఇండియన్ సినీ తార లీసా రే మీడియా ముందు వెల్లడించారు. అప్పుడే మూడు బాలివుడ్ సినిమా ప్రాజెక్టుల్లో నిమగ్నమయ్యానని ఆమె తెలిపారు. 2009, జూన్‌లో ఆమెకు తెల్ల రక్తకణాల్లో క్యాన్సర్ ఉన్నట్టు బయటపడింది. అప్పటి నుంచి ఆమె సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు బాగా కోలుకున్నానని, అందుకే మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టానని ఆమె చెప్పారు. వాస్తవానికి తనలో క్యాన్సర్ గుర్తించిన నాటి నుంచే తాను నిజమైన జీవితాన్ని గుడుపుతున్నానని, ఈ జబ్బు వల్లనే జీవితం విలువ తెలిసొచ్చిందని, ఇక ముందున్నదంతా తనది తాత్విక జీవితమేనని ఆమె అన్నారు. లీసా రే 2001లో విక్రమ్ భట్ తీసిన ‘కసూర్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత దీపా మెహతా తీసిన ‘వాటర్’, దిలీప్ మెహతా తీసిన ‘కుకింగ్ విత్ స్టెల్లా’ లాంటి చిత్రాల్లోనే కాకుండా ‘కిల్ కిల్ ఫాస్టర్ ఫాస్టర్’ బ్రిటిష్ త్రిల్లర్ చిత్రంలో, మరికొన్ని హాలివుడ్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం సంజయ్ డేమా దర్శకత్వంలో వెలువడనున్న తొలి సినిమా ‘ఇష్క్ ఫరెవర్’ తాను నటిస్తున్నానని, ఇది ఈ ఏడాది చివరలో విడుదలవుతోందని ఆమె తెలిపారు. అలాగే సంజయ్ సూరి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. ‘మై ఔర్ చార్లెస్’ సినిమా సీక్వల్‌లో ఓ పాత్ర కోసం ఆ సినిమా నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయని ఆమె తెలిపారు. అంతర్జాతీయ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ జీవిత గాధ ఆధారంగా నిర్మిస్తున్న ‘మై ఔర్ చార్లెస్’ సినిమా జూలైలో విడుదల కానుంది.
క్యాన్సర్ అంటే నాకు లెక్కలేదు...
Published Sat, Apr 25 2015 3:47 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM
Advertisement
Advertisement