నేనొక దేశదిమ్మరిని
న్యూఢిల్లీ: కొత్త కొత్త అనుభవాలకోసం వెంపర్లాడుతుంటానని, అందువల్లనే ప్రపంచంలోని అనేక నగరాల్లో ఉన్నానని, ఒకేచోట ఉండలేకపోయానని నటి లీసారే తన మనసులో మాట చెప్పింది. త్వరలో సొంతగడ్డ అయిన భారత్‌కు రావాలని యోచిస్తున్నట్టు కేన్సర్ వ్యాధి బారినపడి విజయవంతంగా బయటపడిన ఈ 42 ఏళ్ల ఇండో కెనడియన్ ఇటీవల ప్రకటించింది. తన జీవితాన్ని, సినిమా కెరీర్‌ను మార్చేసిన తళుకుల నగరానికి రాబోతున్నానంది.
‘నేనొక దేశదిమ్మరిని. ప్రకృతిపరంగా వివిధ రకాల అనుభవాలను నా మనసు కోరుకుంటుంది. చిన్నతనంలో ఒకేచోట ఉండేదాన్ని. ఇప్పుడు జీవితంతోపాటు పరిశ్రమ కూడా మారిపోయింది. నాకు ఇక్కడ ఎన్నో ప్రాజెక్టులు దక్కబోతున్నాయి. వెనక్కివచ్చేయాలనే ఆలోచన ఏనాటినుంచో ఉంది. అయితే ఎప్పుడు రావాలనేదే ఓ ప్రశ్నగా మిగిలిపోయింది’ అని అంది. వ్యక్తిగత, వృత్తిపరమైన కారణాల వల్లనే టొరంటోనుంచి ముంబైకి రావాలనుకుంటున్నానని ఈ రెండు నగరాల మధ్య తరచూ రాకపోకలు సాగించే ఈ ‘వాటర్’ నటి తెలిపింది.
‘నన్ను తీర్చిదిద్దిన నగరంలో మరింత సమయం గడపాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తించాను. ఏ దేశంలో ఉన్నప్పటికీ నా మనసులో కొంత భాగం భారతదేశంలోనే ఉండేది. నా జీవితానికి సంబంధించి మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. నా జీవితానికి ఏది వర్తిస్తుంది ? ఏది వర్చించదు? అనే విషయం నాకు బాగా తెలుసు. నాకు నా స్నేహితులు ఎంతో ముఖ్యం. ఇందుకు వ్యక్తిగతమైన కారణాలతోపాటు వృత్తిపరమైన కారణాలు కూడా ఉన్నాయి’ అని అంది. కాగా లీసారే కాశ్మీర్ కథాంశంగా రూపొందబోతున్న సినిమాకు సంతకాలు చేసింది. ఈ సినిమాలో సంజయ్‌సూరి సరసన నటించనుంది.