నేను ‘ప్రత్యేక’ నటిని!
నేను ‘ప్రత్యేక’ నటిని!
Published Thu, Jan 9 2014 10:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘సినిమాకు ప్రేక్షకుడిని రప్పించే శక్తి ఉన్న ప్రత్యేక పాటలను ఐటమ్ సాంగ్స్ అంటూ చులకనగా మాట్లాడటం అన్యాయం. మేం చేసే పాటలు ఆయా సినిమాలకు అదనపు ఆదరణను పెంచుతున్నాయని ఎందుకు అనుకోకూడదు.. ప్రత్యేక పాట(ఐటమ్ సాంగ్)లపై పాజిటివ్‌గా ఆలోచిస్తే బాగుంటుంది..’ అని బాలీవుడ్ ఐటమ్ బాంబ్‌గా గుర్తింపు పొందిన నటి మల్లికా అరోరా ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె ‘ఛయ్య ఛయ్య ఛయ్య’,‘మున్నీ బద్‌నామ్ హుయీ’ వంటి ఐటమ్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అగ్ర హీరోయిన్లుగా వెలుగొందుతున్న కరీనా కపూర్ ఖాన్, దీపికా పడుకొనే, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ తదితరులు సైతం ఐటమ్ సాంగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించడానికి ఆమె నిరాకరించారు.
‘పరిశ్రమలో ఎవరి పని వారికుంటుంది.. టాలెంట్ ఉన్నవారిని అవకాశాలు అవే వెదుక్కుంటూ వస్తాయి.. ఏ పాటకు ఎవరు న్యాయం చేయగులుగుతారని భావిస్తారో వారికే ఆ అవకాశం దక్కుతుంది..’ అని ఆమె తెలిపారు. 2010లో విడుదలైన దబాంగ్ సినిమాలో ఆమె చేసిన ప్రత్యేక పాట ‘మున్నీ బద్‌నామ్ హుయీ’ అప్పట్లో చాలా పెద్ద హిట్. ప్రస్తుతం తాను టీవీ రియాలిటీ షో ‘ఇండియాస్ గాట్ టాలెంట్’కు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ‘ఈ రియాలిటీ షో మొదటి భాగంలో నేను సగం సీజన్ మాత్రమే పనిచేశాను. ఈసారి మాత్రం మొదటి నుంచి పనిచేస్తున్నాను. ప్రతిరోజూ 20-25 మంది పోటీదారులను పరీక్షిస్తున్నాం. అందరూ బాగా చేస్తున్నారు. పోటీదారుల్లో కొందరిని అనర్హులుగా ప్రకటించడం కష్టంగా ఉంటోంది. అయినా ఈ పని చాలా ఆసక్తిని పెంచుతోంది..’ అని అన్నారు.
Advertisement