
ఆ కల నన్ను భయపెడుతుంటుంది!
‘‘ఆ కల వస్తే చాలు.. ఇక ఆ తర్వాత నా కంటి మీద కునుకు ఉండదు. ఆ రోజంతా ఆ భయం నన్ను వెంటాడుతుంటుంది’’ అని చెప్పారు తమన్నా. ఈ రేంజ్‌లో చెబుతున్నారంటే తమన్నా కలలో ఏ దెయ్యాలో, భూతాలో కనిపిస్తున్నాయేమో.. లేకపోతే అయినవాళ్లకు ఏదో అయినట్లుగా కలలు వస్తున్నాయేమో... ఇలా రకరకాల ఊహలు కలగడం సహజం. కానీ, తమన్నాకి వచ్చిన కల చాలా సింపుల్. ఈ కల గురించి తెలుసుకుంటే దీనికి ఇంత భయపడాలా? అని ఎవరైనా నవ్వేస్తారు.
ఇంతకీ ఆ కల ఏంటో తెలుసా? జుత్తు ఊడిపోయినట్లుగా కల వస్తుంటుందట. దాని గురించి తమన్నా చెబుతూ -‘‘ఇంకా నేను మూడు పదుల వయసు కూడా టచ్ కాలేదు. అప్పుడే జుత్తు ఊడిపోదని నాకు తెలుసు. కానీ, ఆ కల వస్తే చాలు భయపడిపోతుంటాను. ఎందుకంటే.. ఓ వ్యక్తి అందంలో కురులకు చాలా ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు. మహా అయితే ఇంకో నాలుగైదేళ్లల్లో 30వ పడిలోకి అడుగుపెట్టేస్తారు కదా.. అప్పుడు జుత్తు సంగతెలా ఉన్నా..
మూడు పదుల్లో ఉన్న తారలకు అవకాశాలు తగ్గుతాయేమో? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘ట్వంటీస్‌లో ఉన్న తారల కోసం పాత్రలు రాసినట్లుగా థర్టీస్‌లో ఉన్నవాళ్లకి రాయరు. ఆ సంగతలా ఉంచితే.. 30 ఏళ్లకు చేరుకున్న తర్వాత చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకుని, సెటిల్ కావాలనుకుంటున్నారు. అలాంటివాళ్లు అవకాశాల గురించి ఆలోచించరు’’ అని చెప్పారు.