రెండొందల రోజులు ఆడాలి
- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్
‘‘నా అభిమాన నటులు ఎన్టీ రామారావుగారు. ఆయన తనయుడు బాలకృష్ణ అంటే నాకు ప్రీతిపాత్రులు. ఒకప్పుడు మనల్ని ‘మదరాసీయులు’ అని పిలిచేవారు. తెలుగువారిని అలా పిలవకూడదంటూ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన ఘనత ఆయనది. ఎన్టీఆర్ ఒక తరం నటులు కారు, తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ. ఆయన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుంటారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే విభజన ఉన్నా, శాతవాహన చక్రవర్తి వచ్చిన తర్వాత మనకంటూ ఒక శకం మొదలైంది. ఆ కథాంశంతో సినిమా తీయడం అభినందనీయం. బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు ఆడాలి.
ఈ సినిమా పూర్తయిన తర్వాత మొదటి ఆటను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వస్తా’’ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో బిబో శ్రీనివాసరావు సమర్పణలో ఫస్ట్ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవం శుక్రవారం హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు చిరంజీవి కెమేరా స్విచ్చాన్ చేయగా, సీఎం కేసీఆర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. దాసరి మాట్లాడుతూ- ‘‘బాలకృష్ణ వందో చిత్రంగా తెలుగుజాతి మొదటి చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి కథను ఎంచుకోవడం తెలుగుజాతి గర్వించదగ్గ విషయం. ఈ కథ ఆలోచన క్రిష్‌కు రావడం, దానిలో నటించేందుకు బాలయ్య ఒప్పుకోవడం గొప్ప విషయం’’ అని అభినందించారు.
చిరంజీవి మాట్లాడుతూ ‘‘ఈ కథను, దర్శకునిగా క్రిష్‌ను బాలకృష్ణ ఎంచుకున్నప్పుడే బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ఇలాంటి పాత్రలు బాలకృష్ణ అవలీలగా చేయగలరు. ఓ సినిమా వందరోజులు ఆడటం గగనమైపోతున్న ఈ రోజుల్లో ఈ చిత్రం సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘బాలకృష్ణగారి వందో చిత్రం రెండొందల రోజులు, వెయ్యి థియేటర్లలో ఆడాలి’’ అని హీరో వెంకటేశ్ ఆకాంక్షించారు. బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘ఎన్టీఆర్ వారసుడిగా వైవిధ్యమైన చిత్రాల్లో నటించాలన్నది నా తపన. 1973లో మా నాన్నగారు నటుడిగా నా నుదుట తిలకం దిద్దారు. ఈ 43 ఏళ్లలో నేను 99 చిత్రాల్లో నటిస్తే, 71 సినిమాలు శతదినోత్సవం జరుపుకొన్నాయి.
ఇందుకు నా తల్లితండ్రుల దీవెన, నా ఆత్మబలం, తెలుగు ప్రేక్షకుల ఆశీర్వాదం, నా అభిమానులే కారణం. నా ఈ ప్రయాణంలో నాతో నడిచిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు ధన్యవాదాలు. తెలుగు వారందరికీ ఈ వందో చిత్రం అంకితం’’ అని చెప్పారు. ‘‘కథ విన్న మరుక్షణం నుంచీ నన్ను ముందుకు నడిపిస్తున్న బాలకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అని దర్శకుడు క్రిష్ తెలిపారు. భారీయెత్తున జరిగిన ఈ ప్రారంభ వేడుకకు హాజరైనవారిలో ప్రముఖులు తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాసయాదవ్, దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కె. రాఘవేంద్ర రావు, ఎ. కోదండరామిరెడ్డి, ఎన్.శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ్, శ్రీవాస్, సినీ రచయితలు విజయేంద్రప్రసాద్, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తదితరులు ఉన్నారు.