బాలయ్య సినిమాకు.. కేసీఆర్ క్లాప్
హైదరాబాద్: క్రిష్ దర్శకత్వం వహిస్తున్న నందమూరి నట వారసుడు బాలకృష్ణ వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్ అట్టహాసంగా మొదలైంది. అతిరథ మహారథుల మధ్య అన్నపూర్ణ స్టూడీయోలో అంగరంగ వైభవంగా పదిగంటల ప్రాంతంలో పూజ కార్యక్రమాలతో షూటింగ్ మొదలైంది. బాలకృష్ణ చేస్తున్న సెంచరీ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ వర్గాలు, అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసినిమా షూటింగ్ కు హాజరుకావాల్సిందిగా ప్రత్యేక ఆహ్వాన పత్రికలు కూడా అందించారు.
ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై కొబ్బరి కాయ కొట్టారు. మంత్రులు హరీశ్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి కూడా హాజరై కొబ్బరి కాయలు కొట్టారు. ఇక దాదాపు తెలుగు చిత్ర సీమలోని అగ్ర దర్శకులు, హీరోలంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శుక్రవారం ఉదయం పదిగంటల ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ సందడి మొదలైంది. ముహుర్తపు సన్నివేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాప్ కొట్టారు. గౌరవ దర్శకత్వం దాసరి నారాయణరావు వహించగా నటులు చిరంజీవి, వెంకటేశ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.