కేసీఆర్ మైకు అందుకోగానే నాన్ స్టాప్ విజిల్స్..
హైదరాబాద్: ఎక్కడికి వెళ్లినా ముఖ్యమంత్రి కేసీఆర్ తన వాగ్దాటికి తిరుగులేదనిపించుకున్నారు. ఆయన ప్రసంగానికి మరోసారి విజిల్స్ మోతమోగాయి. బాలకృష్ణ నటిస్తున్న వందో సినిమా 'గౌతమీ పుత్ర శాతకర్ణి' షూటింగ్ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఆయనలా మైకు అందుకొని నటరత్న రామారావుగారంటే అని అనగానే నాన్ స్టాప్గా విజల్స్, చప్పట్లు మోతమోగాయి. దాంతో కాసేపు మాట్లాడకుండా వారి సంతోషాన్ని గమనించిన కేసీఆర్ తనకు ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని, ఆయనను ఇష్టపడని కుటుంబం, తెలుగువారు లేరే లేరని అన్నారు.
శకయుగాన్ని ప్రారంభించిన గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో తన వందో సినిమా తీయాలని బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం గొప్పదని అన్నారు. బాలకృష్ణకు ఈ చిత్రం విజయవంతం కావాలని నా దీవెనలు అందిస్తున్నానని చెప్పారు. ఈ వందో సినిమా 200 రోజులు ఆడుతుందని చెప్పారు. నందమూరి కుటుంబం అంటే తెలుగువారికి ఎంతో ప్రేమ అని, మద్రాసీలు అనే పేరు పొగొట్టి ఆంధ్రావారు, తెలుగువారు అని పేరును తెచ్చిన గొప్ప వ్యక్తి రామారావు అని అన్నారు. ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఆయన ఏ జ్ఞాపకాన్నైనా పదిలంగా కాపాడుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒకే తరం నటుడు కాదని చెప్పారు. తెలుగు జాతి గొప్ప బిడ్డ అని కొనియాడారు. వందో సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే తొలిసారి తొలి ఆట చూసే అవకాశం తమకు ఇవ్వాలని, కుటుంబ సమేతంగా చిరంజీవి, వెంకటేశ్ తో కలిసి ఈ సినిమా చూస్తానని చెప్పారు.