దొంగ పెళ్లి మాత్రం చేసుకోను | i will do love marriage only, says Tamanna | Sakshi
Sakshi News home page

దొంగ పెళ్లి మాత్రం చేసుకోను

Published Thu, Jul 24 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

దొంగ పెళ్లి మాత్రం చేసుకోను

దొంగ పెళ్లి మాత్రం చేసుకోను

‘‘పెళ్లంటూ చేసుకుంటే ప్రేమ వివాహమే చేసుకుంటాను’’ అని మీడియా సాక్షిగా చెప్పేశారు తమన్నా. అక్షయ్‌కుమార్‌కు జోడీగా ఆమె నటించిన ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ చిత్రం ఆగస్ట్ 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారీ మిల్కీ బ్యూటీ. ఇందులో భాగంగానే ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్‌వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. ‘‘పెళ్లి మీద నాకు కచ్చితమైన అభిప్రాయం ఉంది. అమ్మానాన్నలు చూపించిన అబ్బాయిని ఇష్టం ఉన్నా, లేకపోయినా పెళ్లి చేసేసుకొని, సర్దుకుపోయి కాపురం చేయడం అనే విధానానికి నేను విరుద్ధం.
 
  ఎక్కడైనా రాజీ పడొచ్చుకానీ, జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మాత్రం రాజీ పడకూడదు. అందుకే... నేను ముమ్మాటికీ ప్రేమ వివాహమే చేసుకుంటాను. అయితే ఇంట్లోవారికీ, మీకూ చెప్పే చేసుకుంటాను కానీ, దొంగచాటు పెళ్ళి మాత్రం చేసుకోను’’ అని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పారు తమన్నా. ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ సినిమా గురించి మాట్లాడుతూ -‘‘పేరుకు తగ్గట్టుగానే ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందీ సినిమా. పొట్టచెక్కలయ్యేట్టు నవ్విస్తుంది. అయితే... భావోద్వేగపూరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయి.
 
  ఇంతవరకూ నా కెరీర్‌లో చేయనటువంటి భిన్నమైన పాత్రను ఇందులో చేశాను. ఇక అక్షయ్‌కుమార్‌తో నటించడం మాత్రం నా జీవితంలో మరిచిపోలేను. దాదాపు పాతికేళ్ల కెరీర్ ఆయనది. కానీ... ఇప్పటికీ తొలి సినిమాకు కష్టపడ్డట్టే కష్టపడతారు. ఈ సినిమా పుణ్యమా అని ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తెల్లవారు జామునే నిద్ర లేస్తారాయన. జీవితాన్ని ఎంతో క్రమశిక్షణతో సాగిస్తుంటారు. అందుకే... ఇప్పటికీ అంత ఫిట్‌గా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు తమన్నా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement