
ప్రత్యూషకు అన్నీ నేనై ఉంటా: పోసాని
హైదరాబాద్: కన్నతండ్రి సవతి తల్లి చేతిలో తీవ్ర చిత్ర హింసలు ఎదుర్కొని ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూషకు అన్నీ తానై ఉంటానని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆమె ఆస్పత్రిలో నుంచి ఢిశ్చార్జి అయినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు తానే అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పారు. శుక్రవారం సాక్షితో మాట్లాడిన ఆయన ప్రత్యూష బీఎస్సీ చదవాలనకుంటుందని తెలిసిందని, ఆ బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత పోసానిగారు ఇక మీ సాయం చాలు అనేంత వరకు తాను కంటికి రెప్పలా చూసుకుంటానని తెలిపారు. ఈ ఘటన తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తామంటే తాము ఆదుకుంటామని అన్నవారే తప్ప ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని చెప్పారు.
ఈ విషయం తనను అమితంగా కలిచివేసిందని, ప్రత్యూష ఘటనకు ఎంత చలించిపోయానో, ఎంతగా ఏడ్చానో తనకు, తన భార్యకు మాత్రమే తెలుసునని అన్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు మనకెందుకులే అని చానెల్ మార్చి వేరే ప్రోగ్రాం చూస్తే అసలు మనం మనుషులమే కాదని అన్నారు. మిమ్మల్ని ఇంతగా కదిలించడానికి గల కారణమేమిటని పోసానిని ప్రశ్నించగా.. తాము కూడా ఒకప్పుడు బాగా బతికామని, డబ్బులు అయిపోయాక తన తండ్రి ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దాంతో దొంగనో రౌడీనో కావాల్సిన నేను పరుచూరి బ్రదర్స్ దయతో చక్కటి క్రమశిక్షణ నేర్చుకుని ప్రయోజకుడినయ్యానని తెలిపారు. అప్పటి నుంచే తీవ్ర ఇబ్బందులు పడేవారిని చూస్తే తన గుండె తరుక్కుపోతుందని, వెంటనే స్పందిస్తానని చెప్పారు. తనకే గనుక ప్రత్యూష కేసు విషయంలో తీర్పు ఇచ్చే అవకాశం వస్తే ఆ తండ్రికి, సవతి తల్లికి అదే రోజు ఉరిశిక్ష వేసి, అదే రోజు అమలు చేయాలని చెప్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ సవతి తల్లి ఒక ఆడదేనా అని ప్రశ్నించారు.