గోవాలో శశికపూర్ చిత్రోత్సవం
శశికపూర్... పరిచయ వాక్యాలు అవసరంలేని పేరిది. ఎనన్ని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఒకటా.. రెండా.. నలభై ఏళ్ల సినిమా చరిత్ర ఆయనది. నాలుగు దశాబ్దాల్లో 160 చిత్రాల్లో నటిస్తే, వాటిలో పన్నెండు ఆంగ్ల చిత్రాలుండటం విశేషం. బాలనటునిగా, హీరోగా, నిర్మాతగా, దర్శకునిగా సినిమా రంగంలో పలు శాఖల్లో తన ప్రతిభ నిరూపించుకుని ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అనిపించుకున్నారు. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు దాదాసాహెబ్ పురస్కారం (2014) తెచ్చి పెట్టాయి.
ఇప్పటివరకూ ఎన్నో అవార్డులూ, రివార్డులూ అందు కున్న శశికపూర్‌కు గోవాలో జరగనున్న 46వ ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఐ.ఎఫ్.ఎఫ్.ఐ)లో ఓ అరుదైన గౌరవం దక్కనుంది.
వచ్చే నెల 20 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ చిత్రోత్సవాల్లో శశికపూర్ నటించిన ‘హౌస్ హోల్డర్’, ‘షేక్‌స్పియర్‌వాలా’, ‘దీవార్’, ‘జునూన్’, ‘కలియుగ్’, ‘ఉత్సవ్’, ‘ఢిల్లీ టైమ్స్’, ‘ఇన్ కస్టడీ’ - ఇలా 8 చిత్రాలను స్పెషల్ రెట్రాస్పెక్టివ్ విభాగంలో ప్రదర్శించనున్నారు. ఈ విషయం గురించి శశికపూర్ తనయుడు నటుడు కునాల్ కపూర్ స్పందిస్తూ - ‘‘మా నాన్నగారు నటించిన 8 చిత్రాలను అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించాలని డీఎఫ్‌ఎఫ్ (డైరక్టరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్) కమిటీ తీసు కున్న నిర్ణయం మాకు సంతోషంగా ఉంది. కానీ, అనారోగ్య కారణాల వల్ల ఆయన స్వయంగా ఈ వేడుకకు హాజరు కాలేరు’’ అని తెలిపారు.