ఇళయరాజాతో సఖ్యత లేదా?
ఇళయరాజాతో సఖ్యత లేదా?
Published Thu, Mar 13 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన కొడుకు యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజాల మధ్య సఖ్యత కొరవడిందన్న ప్రచారం జరగుతోంది. దీనికి కారణం యువన్ శంకర్‌రాజా మత మార్పిడికి పాల్పడటమేనని సమాచారం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడిగా మంచి స్థాయిలో ఉన్నా ఆయన వైవాహిక జీవితం మాత్రం సమస్యల మయమే. ఇప్పటికే ఆయన చేసుకున్న రెండు పెళ్లిళ్లు పెటాకులయ్యాయి. కారణాలేమయినా యువన్ శంకర్ రాజా ఈ మధ్యనే ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఈ మత మార్పిడి తన తండ్రి ఇళయ రాజాకు ఇష్టంలేదని ఈ విషయంలో వీరిద్దరి మధ్య సఖ్యత కొరవడిందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని యువన్ శంకర్ రాజా ఖండించారు.
ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ తాను ఇస్లాం మతం స్వీకరించిన విషయం నిజమేనన్నారు. దీన్ని తాను గొప్పగా భావిస్తున్నానని ఈ విషయంలో తన కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారని చెప్పారు. తన తండ్రి ఇళయరాజాకు తనకు మద్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేస్తూ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. యువన్ శంకర్ రాజాకు తన తల్లి అంటే ఎనలేని ప్రేమ అని ఆమె మరణం ఆయనకు తీరని లోటు అని యువన్ స్నేహ బృందం అంటోంది. ఆ మధ్య యువన్ ఒక ఆధ్యాత్మిక గురువును కూడా కలుసుకున్నారని అలాంటిది ఇస్లామ్ మతం ఎందుకు స్వీకరించారో అర్థం కావడం లేదని వారన్నారు. యువన్ ఎ.ఆర్.రెహ్మాన్‌ను అనుసరిస్తున్నారా? అన్న ప్రశ్నకు అలాంటి దేమీలేదన్నారు. అయితే త్వరలో తన పేరును కూడా మార్చుకోవడానికి యువన్ రెడీ అవుతున్నారని, రోజు ఐదుసార్లు సమాజ్ చేస్తున్నారని తెలిపారు.
Advertisement
Advertisement