చెన్నై ,పెరంబూరు: తనకు సంగీతం గురించి ఏమీ తెలియదు అని పేర్కొన్నారు సంగీతజ్ఞాని ఇళయరాజా. ఈయన 75 వసంతాల వేడుకలను పలు వేదికలపై జరుపుకుంటున్నారు. పలు విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులతో తన అనుభవాలను పంచుకుంటున్న ఇళయరాజా శుక్రవారం చిదంబరంలోని అన్నామలై విశ్వవిద్యాలయంలో తన 75వ పుట్టిన రోజును జరపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ 1994లో ఇదే వేదికపై తాను డాక్టరేట్ బిరుదును అందుకున్నానని గుర్తు చేశారు. గీతం, సంగీతం గాలిలోని అశుభ్రతను స్వచ్ఛ పరుస్తాయని అన్నారు. మనం అన్ని రకాల సంగీతానికి తలాడించడం లేదన్నారు.
పరిపక్వత చెందిన గొంతుల నుంచి వచ్చే సంగీతానికే తన్మయత్వం చెందుతున్నామని పలువురు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఎగిసి పడే ఒక్కో అల ఒక్కో విధం మాదిరిగా విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో విధం అని అన్నారు. నీరు ప్రవహించే ప్రాంతాలు పచ్చదనంతో నిండి ఉన్నట్లు, విద్యార్థులు వెళ్లే పలు రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. సంగీతంలో తాను చెప్పని పలు సాధనాలు ఉన్నాయని, అదేవిధంగా సంగీత కళాకారులు తయారు కావడం లేదని, పుడుతున్నారని అన్నారు. తనకు సంగీతం గురించి ఏమీ తెలియదని, అందుకే సంగీతాన్ని కొనసాగించుకుంటూ పోతున్నానని ఇళయరాజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment