
ఇళయరాజా, ∙మనవరాలు జియాతో...
ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తన మనవరాలికి సంగీత పాఠాలు నేర్పిస్తున్నారు. ఇళయరాజా తనయుడు యువన్‌శంకర్ రాజా కుమార్తె జియా యువన్ ఇటీవల తాత దగ్గర పియానో నేర్చుకుంటున్న వీడియో చాలామందిని ఆకట్టుకుంది. పియానోతో సరిగమలు ఎలా పలికించాలో మనవరాలికి నేర్పుతున్న దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు యువన్. ఈ వీడియో చూసిన శ్రుతీహాసన్ , విజయ్ ఏసుదాసు, శ్వేతాపండిట్ వంటి వారు ‘చాలా బాగుంది’ అంటూ జియాని అభినందిస్తూ కామెంట్లు పెట్టారు.
కాగా ఇళయరాజా ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఇళయరాజా వారసులుగా కుమారులు కస్తూరి రాజా, యువన్ శంకర్ రాజా, కుమార్తె భవతారిణి కూడా సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ సంగీతదర్శకులుగానే కాదు పాటలు కూడా పాడతారు. మరి.. ఇప్పుడు మనవరాలికి కూడా స్వరాలు నేర్పిస్తున్నారంటే ఇళయరాజా కుటుంబం నుంచి మరో మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు.