ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంపెట్టండి | Ilayaraja Attend Hes Son yuvan shankar raja Movie Audio Launch | Sakshi
Sakshi News home page

ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంపెట్టండి

Published Tue, Jul 31 2018 10:39 AM | Last Updated on Tue, Jul 31 2018 10:39 AM

Ilayaraja Attend Hes Son yuvan shankar raja Movie Audio Launch - Sakshi

తమిళసినిమా: ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంగా పెట్టండి అని సంగీతజ్ఞాని ఇళయరాజా ఈ తరం సంగీత దర్శకులకు హితవు పలికారు. ఆయన కొడుకు, ప్రముఖ సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా వైఎస్‌ఆర్‌ పిక్చర్స్‌ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి కే.ప్రొడక్షన్స్‌ రాజరాజన్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ప్యార్‌ ప్రేమ కాదల్‌. యువ నటుడు హరీశ్, నటి రైసా విల్సన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఇళన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్‌ శంకర్‌రాజానే సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ఏవీఎం స్టూడియోలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఇళయరాజా పాల్గొని చిత్ర ఆడియోను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్మాతగా మారిన యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ తన మిత్రుడు ఇర్ఫాన్‌ ఒకసారి మీ అభిమానుల కోసం ఒక చిత్రం చేయవచ్చుగా అని అన్నాడన్నారు. తన బలమే ప్రేమ గీతాలని, సమీప కాలంలో అలాంటి పాటలు తన చిత్రాల్లో చోటు చేసుకోలేదని అన్నారు. అందుకే ప్రేమ గీతాలతో కూడిన చిత్రం చేయాలన్న ఆలోచనే ఈ ప్యార్‌ ప్రేమ, కాదల్‌ చిత్రం అని తెలిపారు. అతిథిగా పాల్గొన్న నటుడు ధనుష్‌ మాట్లాడుతూ కళాకారులందరికీ ప్రేమే మానసిక శక్తి అని పేర్కొన్నారు. తుళ్లువదో ఇళమై, కాదల్‌ కొండేన్‌ చిత్రాల సమయంలో తానూ, అన్నయ్య సెల్వరాఘవన్‌ కష్టపడుతున్నప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీతమే తమకు గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. అలా తాను ఆయనకు రుణ పడి ఉన్నానని అన్నారు. మరో నటుడు శింబు మాట్లాడుతూ ఇది ఆడియో ఆవిష్కరణ వేడుక మాదిరి కాకుండా సినీ ప్రముఖుల గెట్‌ టు గెదర్‌లా ఉందన్నారు. యువన్‌ శంకర్‌రాజా తనకు తండ్రి లాంటి వాడన్నారు.

తను శత్రువులు కూడా బాగుండాలని భావించే వ్యక్తి అనీ, ఆయన కోసం వచ్చిన కూటం ఇదనీ శింబు పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడుతూ తొలిసారిగా చిత్ర నిర్మాణం చేపట్టిన యువన్‌శంకర్‌రాజాను ఆశీర్వదించడానికి వచ్చానన్నారు. ఈ తరం సంగీత దర్శకులకు తాను చెప్పేదొక్కటేనని, ఎలక్ట్రానిక్‌ సంగీతాన్ని దూరంగా పెట్టి, సహజ సంగీత వాయిద్యాలతో భాణీలను కట్టాలని అప్పుడే నూతనోత్సాహాన్ని కలిగిస్తాయని హితవు పలికారు. కార్యక్రమంలో దర్శకుడు రామ్, శీనూరామసామి, అమీర్, అహ్మద్, నటుడు జయంరవి, విజయ్‌సేతుపతి, ఆర్య, కృష్ణ, శాంతను, నటి రేఖ, బింధుమాదవి, సంగీత దర్శకుడు డీ.ఇమాన్, సంతోష్‌నారాయణన్‌ పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement