
రామ్‌చరణ్ సరసన ఇలియానా?
లవ్, సెంటిమెంట్, కామెడీ, యాక్షన్... ఇలా సినిమాలో అన్ని ఐటమ్స్‌తో పాటు ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉంటే కెవ్వు కేక అంటారు ప్రేక్షకులు. పైగా, ఆ ఐటమ్ సాంగ్‌కి స్టార్ హీరోయిన్లు కాలు కదిపితే ఆ కిక్కే వేరు. తాము డ్యాన్స్ చేస్తే ఆ కిక్ ఉంటుందని నాయికలకు తెలుసు కాబట్టే, భారీ ఎత్తున పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. దక్షిణాది తారల్లో ఒకే ఒక్క ఐటమ్ సాంగ్‌కి 50లక్షల నుంచి కోటి రూపాయలు తీసుకున్న తారలు ఉన్నారు. ఇప్పుడు ఇలియానా ‘కోటి’ జాబితాలో ఉన్నారట. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాట ఉందని సమాచారం.
ఈ పాటకు ఇలియానాని తీసుకోవాలనుకున్నారట. ఈ గోవా బ్యూటీకి ఐటమ్ సాంగ్స్ చేయడం గురించి పెద్దగా అభ్యంతరం లేకపోయినా పారితోషికం విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉన్నారట. ఒక్క పాట కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారని భోగట్టా. 40 లక్షలు ఇవ్వడానికి చిత్రనిర్మాత డీవీవీ దానయ్య సుముఖంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతం పారితోషికం విషయంలో నిర్మాతకు, ఇలియానా మధ్య చర్చలు జరుగుతున్నాయట. మరి.. ఆ చర్చల ఫలితం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే తెలుగులో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత ఇలియానా ఇక్కడ వేరే సినిమాలు చేయలేదు.
‘బర్ఫీ’ చిత్రం ద్వారా హిందీ రంగప్రవేశం చేశారు. ఆ చిత్రం ఈ గోవా బ్యూటీకి మంచి పేరు తెచ్చింది. దాంతో అక్కడ బాగానే అవకాశాలు వచ్చాయి. ‘బర్ఫీ’ తర్వాత ‘హ్యాపీ ఎండింగ్’, ‘మై తేరా హీరో’ చిత్రాల్లో నటించారామె. ఇప్పుడు మళ్లీ దక్షిణాది చిత్రాల్లో నటించాలనుకుంటున్నారట. అందుకని, పారితోషికం విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించి, చరణ్‌తో ఐటమ్ సాంగ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేకపోలేదు.