ఎవరికీ పోటీ కాను
సిద్ధార్థ్ నటించిన ‘జిగర్‌తండా’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల తర్వాత ఒక సంవత్సరం ప్రత్యేకత కలిగి ఉంటుందన్నారు. 2014 తనకు అటువంటి ప్రత్యేకత కల్పించిందన్నారు. ఈ ఏడాది మొదట్లో విడుదలయిన జిగర్‌తండా పెద్ద హిట్ సాధించిందన్నారు. వసంతబాలన్ దర్శకత్వంలో ‘కావ్య తలైవన్’, కన్నడ రీమేక్ చిత్రం ‘లూసియా’ చిత్రాలు త్వరలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ రెండు చిత్రాలు భిన్న కథాంశాలతో రూపొందాయని తెలిపారు. ఇవి కూడా విజయం సాధిస్తాయన్నారు.
తన నిర్మాణంలో చిత్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనేక సంవత్సరాల క్రితం రంగ్ దే బసంతి చిత్రంలో అమీర్‌ఖాన్‌తో నటిస్తుండగా ఆయన తన పాత్రకు మంచి స్కోప్ అందజేసి సహకరించారని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా జిగర్‌తండా చిత్రంలోను మరో పాత్రలో నటించిన సింహా కరతాళధ్వనులు అందుకోనున్నారని గ్రహించానని చెప్పారు. అందుకోసమే తాను నటించానన్నారు. సాటి నటులకు సహకరించడాన్ని అమీర్‌ఖాన్ నుంచి నేర్చుకున్నానని వెల్లడించారు.
ఈ ఏడాది వివాహం చేసుకోనని, వచ్చే ఏడాది జరగవచ్చని పేర్కొన్నారు. దీని గురించి ఇప్పుడే ప్రముఖంగా ప్రస్తావించదలచుకోలేదన్నారు. తెలుగు చిత్రసీమ నుంచి వైదొలగలేదని, తర్వాత రెండు చిత్రాల్లో నటించనున్నానని తెలిపారు. తెలుగులో అభిమానులు తననెంతో ఆదరించారని, వారిని ఎప్పటికీ విడిచివెళ్లనని సిద్ధార్థ్ తెలిపారు.