ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను - కాదంబరి కిరణ్ | I'm still enjoying the result says kadambari Kiran | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను - కాదంబరి కిరణ్

Published Wed, Aug 21 2013 1:27 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను - కాదంబరి కిరణ్

ఇప్పటికీ ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను - కాదంబరి కిరణ్

ఆటుపోట్లు, చిన్న చిన్న సుడిగుండాలు, పెద్ద పెద్ద వాయు గుండాలు... వెరసి సముద్రం. యాజిటీజ్‌గా మనిషి జీవితం కూడా అంతే. వాటన్నింటినీ అధిగమించిన వాడే స్థితప్రజ్ఞుడు. నటుడు కాదంబరి కిరణ్‌కుమార్ కూడా అలాంటివాడే. తన జీవితాన్ని ఒక్కసారి పరికించి చూస్తే... అన్నీ ఆటుపోట్లే కనిపిస్తాయి. నటన, దర్శకత్వం, నిర్మాణం... ఇలా రకరకాల ఆయుధాలతో విధితో పారాడి.. కాదు కాదు.. పోరాడు తున్న ఈ పోరాట సీనియర్ అండ్ సిన్సియర్ పర్సన్‌తో కాసేపు...
 
 ***  ప్రస్తుతం ఏ ఏ సినిమాల్లో నటిస్తున్నారు?
 ‘అత్తారింటికి దారేది’ చేశా. ఇది గాక ఓ 13 సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అలాగే కొన్ని సినిమాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నా. ఒకటి హిట్టయినా... ఫైనాన్షియల్‌గా కాస్త బలపడతా కదా. 
 
 ***  ఇండస్ట్రీ పరిస్థితి పెద్ద బాలేదంటున్నారు. ఇలాంటి టైమ్‌లో రిస్కులు పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో?
 రిస్క్ అనేది నా లైఫ్‌లోనే ఉందన్నా. అలాంటివి పట్టించుకుంటే... బహుశా ఈ స్థాయిలో ఉండేవాణ్ణి కాదేమో. జీవితంలో తెలిసి కొన్ని తప్పులు చేశా. తెలీక ఇంకొన్ని తప్పులు చేశా. దీని వల్ల పెద్ద వాళ్లకు దూరమయ్యా. కొందరికైతే మిత్రుణ్ణయ్యా. ఓ విధంగా చెప్పాలంటే... నా జీవితమే... ఓ గ్రంథం.
 
 ***  అదేంటో కాస్త వివరంగా చెబుతారా?
 మాది కాకినాడ. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే క్రేజ్. నటుణ్ణి అవ్వాలంటే... నాటకాన్ని మించిన ఇనిస్టిట్యూట్ ఉండదు కదా. కాకినాడలో ఎక్కువ అవకాశాల్లేవు. హైదరాబాద్‌లో మా అమ్మమ్మ, మావయ్య ఉండేవారు. వాళ్లని వంకగా చెప్పి... హైదరాబాద్ వచ్చేశాను. ముందు నాటకాల్లో అవకాశాల కోసం తిరిగా. ఎట్టకేలకూ ‘నిజం చెప్పకు’ అనే నాటకంలో వేషం దొరికింది. తర్వాత కొన్ని నాటకాలు, ఆ తర్వాత టెలివిజన్. దాంతో ఇక్కడ నేను బతకగలను అనే నమ్మకం పెరిగింది. 1986లో దూరదర్శన్‌లో నిర్మాత స్థాయికి ఎదిగాను. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే టెలీఫిలిం చేశాను. నేనే దర్శకుణ్ణి కూడా. నటునిగా నాకు తొలి అవకాశం ఇచ్చిన శశికుమార్‌ని హీరోగా పెట్టాను. ఇక ఆ తర్వాత కథ మీకు తెలిసిందే...
 
 ***  మరి జర్నలిజంలోకి ఎందుకు వెళ్లారు?
 నాకు సినిమాలంటే పిచ్చి అని చెప్పాను కదా! సినిమా వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వాలంటే... సినిమా జర్నలిజాన్ని మించింది లేదు. అందుకే జర్నలిజం కోర్స్ జాయిన్ అయ్యాను. తర్వాత ఓ ప్రముఖ సినీ వారపత్రికలో ఉద్యోగం సంపాదించా. కానీ నేను దూరదర్శన్‌లో నాటికలు చేసుకోవడం సదరు యాజమాన్యం వారికి నచ్చలేదు. నాకు మెమో ఇచ్చారు. నేను అక్కడున్నవారందరికీ స్వీట్లు పంచి ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాను. ఎందుకంటే నాకు నటనే ముఖ్యం.
 
 ***  మరి ‘కుర్రాళ్ల రాజ్యం’ (1996)తో దర్శకుడు కూడా అయ్యారుగా?
 అయిష్టంతోనే ఆ సినిమా అంగీకరించా. కానీ ఇద్దరు నిర్మాతలు మారారు. చివరకు మోసం కూడా చేశారు. దాంతో పాటు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. హిట్ అయితే... మరో అంతస్తుకి ఎదుగుతాం. పోతే... మన అంతస్తు మనకుందిగా అనుకున్నాను కానీ, ఒక్క ఫ్లాప్‌తో అధఃపాతాళానికి దిగిపోతాననుకోలేదు. సినిమా పరిశ్రమలో మోసాలు ఆ సినిమా ద్వారా రుచి చూసి కూడా, ఇంకా ఎన్నో రకాలుగా మోసపోయాను. 
 
 ***  ఎన్నో రకాలుగా అంటే...?
 ఓ దర్శకుడు జెమినీ టీవీలో సెటైరికల్ ప్రోగ్రామ్స్ చేస్తుండేవారు. ఆ ప్రోగ్రామ్‌లో నాతో ఓ పాత్ర చేయించాడు. అది చిరంజీవిగారి సినిమాను విమర్శిస్తూ చేసిన ప్రోగ్రామ్. అందుకే నాతో చిరంజీవి గెటప్ వేయించి ఆ ప్రోగ్రామ్ తీశారు. టెలికాస్ట్ అయ్యింది. దాంతో చిరంజీవిగారి ఆగ్రహానికి గురవ్వాల్సి వచ్చింది. ఇప్పటిక్కూడా ఆ ఫలితాన్ని అనుభవిస్తూనే ఉన్నాను. కానీ ఆ దర్శకుడికి మాత్రం చిరంజీవిగారు పిలిచి అవకాశం ఇచ్చారు. అతనెవరో కాదు... జయంత్ సి.పరాన్జీ. అలాగే... ఈవీవీగారు అప్పట్లో నాతో సినిమా ట్రయిలర్స్ చేయించేవారు. 
 
 నేను కూడా ఎంతో ఇష్టంగా చేసేవాణ్ణి. ఓసారి ఎస్వీకృష్ణారెడ్డిగారిని టార్గెట్ చేస్తూ నాతో ఓ ట్రయిలర్ చేయించారు. ఆ ట్రయిలర్ ఆంతర్యం నాకు తెలీదు. తెలీకుండానే చేశాను. కానీ టెలీకాస్ట్ అయ్యాక... కృష్టారెడ్డిగారి కోపానికి గురయ్యాను. ఎన్టీఆర్ కేరక్టర్ చేసి కోట శ్రీనివాసరావు నష్టపోయారు. రేపు నీ గతీ అంతే... అన్నారు కృష్ణారెడ్డి. అనుకున్నట్లే నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదాయన. కానీ రెండోరోజే... ఈవీవీ, కృష్ణారెడ్డి గార్లు మాత్రం వేరే ఓపెనింగ్‌లో కలిసి టెంకాయలు కొట్టారు. ఇవన్నీ నాకు గుణపాఠాలు. 
 
 ***  జీవితంలో మరిచిపోలేని అంశం?
 ఏయన్నార్ కథానాయకుడిగా రెండు సీరియల్స్ చేయడం. మట్టిమనిషి, ఒకేఒక్కడు పేరుతో నేను తీసిన ఆ సీరియల్స్ నా జన్మ ధన్యం చేశాయి. నటునిగా చాలా పాత్రలు చేశాను. గుర్తుంచుకునే పాత్రలు మాత్రం తక్కువే కావచ్చు. కానీ మంచి పాత్రలు వస్తాయని మాత్రం నమ్మకంతో ఉన్నాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement