భారత ఫుట్‌బాల్‌కు ఓ హీరో కావాలి:జాన్ అబ్రహాం
న్యూఢిల్లీ: భారతీయ ఫుట్‌బాల్‌కి మంచి కథానాయకుడు దొరికితే అది అందని తీరాలకు చేరుతుందని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఆట ఆధారంగా ఓ సినిమా కూడా తీస్తున్న ఈ నటుడు ఫుట్‌బాల్ అందుకు సంబంధించిన ఫ్రాంచైజీల్లోనూ పెట్టుబడులు పెట్టాడు. 2014 ఫిఫా వరల్డ్ కప్ వేడుకలను తిలకించేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ‘మంచి క్రీడాకారుడు ఉంటే ఏ ఆటకైనా విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. అందుకు ఉదాహరణ సానియా మీర్జా, నైనా నెహ్వాల్... వీరందరికంటే ముందు ప్రకాశ్ పదుకొణే. గోల్ఫ్‌లో టైగర్ ఉడ్స్ కూడా ఇదే చేశాడు.
భారతీయ ఫుట్‌బాల్‌కి కూడా అటువంటి కథానాయకుడు కావాలని నేను అనుకుంటున్నా’ అని జాన్ అన్నాడు. ‘భైచుంగ్ భాటియా దాదాపు అదే స్థాయిలో ఉన్నాడు. అయినప్పటికీ ఇంకా అంతకంటే మంచి కథానాయకుడు అవసరం. అటువంటి కథానాయకుడు దొరికిన క్షణంలో భారతీయ ఫుట్‌బాల్ ఆట ఉన్నతస్థానానికి చేరుకుంటుంది’ అని చెప్పాడు.