అది సెట్ అని చెప్పినా నమ్మలేదు
పురాణాల్లో తరచూ వినిపించే పేరు మయబ్రహ్మ. దేవతల ఆర్ట్ డెరైక్టర్ అన్నమాట. ఆయనకు ఏ మాత్రం తీసిపోరు మన సినీ కళాదర్శకులు. ఏ ముహూర్తాన సినిమా జనాల ముందుకొచ్చిందో గానీ.. అప్పట్నుంచి లోకాలన్నింటినీ తెరపైకి తెచ్చేసి గత కొన్నేళ్లుగా ప్రేక్షకులను సంభ్రమకు లోను చేస్తున్నారు. మాధవపెద్ది గోఖలే, టీవీఎస్ శర్మ, తోట తరణి లాంటి లెజెండ్స్ సృష్టించిన అద్భుతాలను మనం చూశాం. ఇప్పుడు తెలుగు తెరపై హాట్ ఫేవరెట్ రవీందర్. మగధీర, మర్యాదరామన్న, ఈగ, అత్తారింటికి దారేది... ఈ సినిమాలు చాలు రవీందర్ ప్రతిభ చెప్పడానికి. కళా దర్శకుడంటే... కేవలం సెట్లు వేయడం కాదు, తన సెట్స్ ద్వారా కథను చెప్పాలి, పాత్రల వ్యక్తిత్వాలను సెట్లు ప్రతిబింబించాలి అంటున్న రవీందర్తో కాసేపు.
సెట్ కథకు అద్దం పట్టాలి
‘ఐతే’ సినిమా కోసం ఓ కిళ్లీ కొట్టు సెట్ వేశాను. ఆ సినిమా యూనిట్లో పనిచేసే కుర్రాడే ఆ కొట్టు దగ్గరకెళ్లి ‘ఓ సిగరెట్ ఈయమ్మా’ అనడిగాడు. అక్కడున్నవాళ్లందరూ ఒకటే నవ్వులు. తొలి సినిమాకే నాకు అందిన గొప్ప ప్రశంస అది. అలాగే... ‘రాఖీ’ సినిమా కోసం హీరో ఇంటి సెట్ వేశాం. ఛార్మితో షాట్స్ తీస్తున్నారు కృష్ణవంశీ. ఆమె కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేయాలి. లొకేషన్కి దూరంగా ఓ ఇల్లు చూపించారు కో డెరైక్టర్. ఆమెకు కోపం వచ్చేసింది. ‘ఎదురుగా ఇల్లు పెట్టుకొని అక్కడెక్కడికో వెళ్లమంటారేంటి?’ అంటూ చిరాకు పడిపోయారు. ‘అది సెట్ అమ్మా తల్లీ..’ అన్నా ఆమె నమ్మలేదు. సెట్ అనేది వాస్తవికతకు అద్దం పట్టాలని నమ్ముతాను నేను.
కళా దర్శకునికి కథ తెలిసుండాలి
కళా దర్శకుడికి కథతో పనేంటి? అనేవారు చాలామంది ఉంటారు. కానీ నేను దానికి వ్యతిరేకిని. కళాదర్శకునిగా ‘ఛత్రపతి’కి సైన్ చేయగానే... ముందు కథ చెప్పమని అడిగాను. దానికి నన్ను కిందనుంచి పైకి చూసినవాళ్లు ఉన్నారు. కానీ తర్వాత నా పనితనం చూసి రాజమౌళీగారే అభినందించారు. సముద్రతీరంలో తల్లీ కొడుకుల సెంటిమెంట్ సాంగ్ తీస్తున్నప్పుడు... కొండరాళ్ల మధ్యలో చూచాయగా పాలిస్తున్న తల్లిలా అనిపించే మరో రాయిని ప్రత్యేకంగా చేయించి అమర్చాను. ఆ రాయి ఆ సన్నివేశానికి శోభను తెచ్చింది. ‘మర్యాదరామన్న’లో విలన్ ఇంటి సెట్, అందులోని పాత్రలకు అద్దం పడుతుంది. ఆ సినిమా పతాక సన్నివేశంలో కష్టాలకోర్చి రెండొందల అడుగుల ఎత్తులో వంతెనను నిర్మించాం. ఆ నిర్మాణం నిజంగా అద్భుతమే.
‘మగధీర’ నాకెంతో సంతృప్తినిచ్చింది
‘మగధీర’లో జలపాతాన్ని ఛేదించుకుంటూ గుర్రంపై ఎంటరవుతాడు రామ్చరణ్. అది చాలామంది గ్రాఫిక్స్ అనుకుంటారు. కానీ అది గ్రాఫిక్స్ కాదు. మేం చేసిన మేజిక్. గ్రాఫిక్స్తో ఆ సన్నివేశం తీస్తే జనాలకు తేలిగ్గా అర్థమైపోతుంది. దాంతో ఆసక్తి తగ్గుతుంది. లొకేషన్లో ఆ సీన్ తీసేటప్పుడే అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ సినిమాలోని ఓ సీన్లో చరణ్ డ్రమ్ము వాయిస్తాడు. ఆ డ్రమ్ము నిజంగా తయారు చేశాం. ‘మరీ ఇంత చాదస్తమా?’ అని నిర్మాత వారిస్తున్నా.. వినకుండా... నాగ్పూర్ నుంచి ప్రత్యేకంగా పచ్చిచర్మాన్ని తెప్పించాం. ఆ చర్మం దారుణమైన స్మెల్ వస్తున్నా... భరిస్తూ ఆ డ్రమ్ తయారు చేశాం. చరణ్ ఆ డ్రమ్ వాయిస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటే జనాల్లో వచ్చిన వైబ్రేషన్ తెలిసిందే. ఏ విషయంలోనూ రాజీ పడకుండా నిర్మాత సహకరించడం వల్లే అంత అద్భుతాన్ని తెరపై ఆవిష్కరించగలిగాం.
సెట్ అనేది పాత్ర వ్యక్తితాన్ని ప్రతిభింబించాలి
కళా దర్శకుడు నిర్మాతలతో ఎక్కువ ఖర్చు చేయిస్తారు అనేవాళ్లు కోకొల్లలు. కానీ అందులో నిజం లేదు. సరైన సమయంలో సెట్ అందుబాటులో ఉంటే నిర్మాతకు ఖర్చు తగ్గుతుంది. అందుకు ‘అత్తారింటికి దారేది’ సినిమానే ఓ నిదర్శనం. ఈ సినిమాకు ముందు అనుకున్న పని దినాలు 120. కానీ సెట్ అందుబాటులో ఉండటంతో 103 రోజుల్లో సినిమా పూర్తయింది. కుటుంబ కథలకు ఆర్ట్ డెరైక్టర్తో పనుండదనేది చాలామంది అభిప్రాయం. దాన్ని బ్రేక్ చేసింది ‘అత్తారింటికి దారేది’. నదియా ఇంటి సెట్ నాకు చాలామంచి పేరు తెచ్చింది. ఆ ఇంటి సెట్లో కొన్ని పాతకాలపు వస్తువులను చూపించాం. సెంటిమెంట్లను గౌరవించే నదియా పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించడానికే అలా చేశాం. ‘జూలాయి’ చేస్తున్నప్పుడు 40 లక్షలతో బ్యాంక్ సెట్ వేశాను. ‘బ్యాంక్ సెట్కి అంత ఖర్చా’ అన్నారు. 15 వేల కోట్లు దాచే బ్యాంక్ అది. దానికి 40 లక్షలు వెచ్చించడం తప్పుకాదే. త్రివిక్రమ్ ఈ విషయంలో నాకెంతో సహకరించారు.
సినిమా విజయంలో నా పాత్ర గురించి చెప్పుకోవాలి
సినిమా సక్సెస్లో పనిచేసిన అందరికీ భాగం ఉంటుంది. కాదని అనను. కానీ.. ఒక ఆర్ట్ డెరైక్టర్గా నా ప్రతిభ గురించి ప్రత్యేకంగా అందరూ చెప్పుకోవాలి. నేను కోరుకునేది అదే. చిన్న సినిమాలకూ అందుబాటులో ఉంటున్నాను. ప్రస్తుతం రాజీవ్మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఓ బాలీవుడ్ సినిమాకు, కరుణాకరన్-నితిన్ల సినిమాకు ఆర్ట్ అందిస్తున్నా.