మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌.. | Warangal Police Commissioner Ravinder Special Interview | Sakshi
Sakshi News home page

మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌..

Published Tue, Mar 20 2018 7:44 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

Warangal Police Commissioner Ravinder Special Interview - Sakshi

బాధ్యతలు స్వీకరిస్తున్న సీపీ రవీందర్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : మిస్టర్‌ కూల్‌గా కనిపించే డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ రూల్స్‌ విషయంలో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరు గడించారు. 1991లో గ్రూప్‌–1లో విజయం సాధించి డీఎస్పీగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు రెండో కమిషనర్‌గా ఇటీవల నియమితులైన ఆయన ‘సాక్షి’తో సోమవారం తన అనుభవాలను పంచుకున్నారు. నూతన పోలీస్‌ కమిషనర్‌ స్వగతం, కెరీర్‌లో మరిచిపోలేని ఘటనలు మీ కోసం..

వద్దనుకుంటూనే వచ్చారు..
డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ స్వస్థలం సిద్ధిపేట. తండ్రి రాజేశ్వర్, తల్లి అనసూయబాయి (లేట్‌). డిగ్రీ వరకు అక్కడే చదివారు. తర్వాత ఎమ్మెస్సీ ఎంట్రన్స్‌లో 18వ ర్యాంకు సా«ధించి 1982లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లో చేరారు. అనంతరం వెంటనే పీహెచ్‌డీ పూర్తి చేశారు. అది పూర్తవుతుండగానే ఒకేసారి లెక్చరర్, గ్రూప్‌–1 రాశారు. చిన్నప్పటి నుంచి పోలీస్‌ జాబ్‌ అంటే భయం ఉండడంతో ఇటువైపు రావొద్దని మొదట అనుకున్నారు.

కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలతో లెక్చరర్‌ జాబ్‌ను పక్కనపెట్టి 1991లో డీఎస్పీగా చేరారు. తొలుత తెనాలి, బాపట్ల, గుంటూరులో డీఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత అడిషనల్‌ ఎస్పీగా చిత్తూరు, ఓఎస్‌డీగా కర్నూలు, నల్లగొండలో, డీసీపీగా విశాఖపట్నంలో, ఇంటలిజెన్స్‌శాఖలో ఎస్పీగా, తిరుపతి అర్బన్‌ ఎస్పీగా, కరీంనగర్‌ ఎస్పీగా, హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీగా, హైదరబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ ట్రాఫిక్‌ బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా బదిలీపై వచ్చారు.

సన్నిహితులే స్ఫూర్తి...
స్నేహితులు, సన్నిహితుల నుంచి స్ఫూర్తి పొందినట్లు పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ చెబుతున్నారు. వాళ్ల విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. పట్టుదలతో శ్రమించి చదువులో, కాంపిటేటివ్‌ పరీక్షల్లో విజయం సాధించానని అంటున్నారు. ‘సానుకూల దృక్పథంతో కష్టపడితే ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సాధించవచ్చు. ఏదైనా లక్ష్యం కోసం మంచి మనసుతో కష్టపడితే తప్పక ఫలితం ఉంటుంది.

ఇది నాచురల్‌ సీక్రెట్‌’ అని పేర్కొంటున్నారు. టీ షర్ట్స్‌ ధరించడంపై మక్కువ ఉన్నా, వృత్తిరీత్యా ఎక్కువగా ఖాకీ యూని ఫామ్‌లోనే కనిపిస్తానని.. పనిఒత్తిడి కారణంగా పార్టీలు, ఫంక్షన్లకు హాజరయ్యేది తక్కువేనని.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతిరోజు ఉదయం షటిల్‌ ఆడుతానని తన ఇష్టాయిష్టాలను వెల్లడించారు. చదువుకునే రోజుల్లో సాగర సంగమం సినిమాను అనేకసార్లు చూశానంటూ తన గతాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు.

మరిచిపోలేని సంఘటన
తెనాలిలో పనిచేస్తుండగా ఓ యువకుడి మిస్సింగ్‌ కేసును ఛేదించడం తన వృత్తి జీవితంలో మరిచిపోలేనిదని విశ్వనాథ రవీందర్‌ ఆ ఘటన గురించి వివరించారు. ‘తెనాలిలో పని చేస్తున్నప్పుడు ఓ మహిళ నా దగ్గరకు వచ్చింది. ఒక్కగానొక్క కొడుకు కనిపించడం లేదని, బంధు వులతో కలిసి సినిమాకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి రాత్రి వేళ బయటకు వెళ్లిన కొడుకు తిరిగి  రాలేదంటూ రోదించింది. కొడుకు కోసం ఏడాదిన్నరగా అన్ని చోట్ల తిరిగినా.. ఫలితం లేదని కన్నీరుమున్నీరైంది. చేతికి అందివచ్చిన కొడుకు ఏమైపోయాడో అంటూ ఆ తల్లి పడిన బాధ చూస్తే నా మనసు చలించిపోయింది.

కేసు విచారణ మొదలుపెట్టాను. తప్పిపోయిన కొడుకును సినిమాకు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి మాట్లాడాను. ‘నా అక్క కొడుకు సార్‌. రాత్రి సినిమా చూసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్లం వెళ్లిపోయాం. అప్పటి నుంచి వాడు కనిపించడం లేదు’ అంటూ చెప్పాడు. దీంతో కేసు ముందుకు కదలలేదు. బాగా ఆలోచించగా.. ఆ తల్లి చెప్పిన మాట ల్లో కొడుకు కనిపించకుండా పోయిన తర్వాత ఏడు నెలలకు ఓ చోట కొడుకు షర్ట్‌ కనిపించిందని చెప్పిన అంశం గుర్తుకొచ్చింది. ఆ ప్రదేశానికి వెళ్లి పరిశీలించాం.

షర్ట్‌ దొరికిన ప్రదేశం చుట్టూ అర కిలోమీటరు వరకు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి అంశాన్ని పరిశీలించినా.. ఫలితం లేదు. చివరగా షర్ట్‌ దొరికిన ప్రదేశానికి సమీపంలో నాలుగైదు వ్యవసాయబావులు కనిపించాయి. మోటా ర్లతో అందులో ఉన్న నీరు అంతా బయటకు తోడించాం. ఒక బావిలో ఎముకలు కనిపించాయి. వాటిని బయటకు తీసి.. పేరిస్తే మనిషికి సంబంధించినవిగా తేలింది. వెంటనే మరోసారి సినిమా కు తీసుకెళ్లిన బంధువులను పిలిపించి గట్టిగా ప్రశ్నించడంతో నేరం ఒప్పుకున్నాడు.

ఆస్తి కోసమే అల్లుడిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ‘అక్కకు ఒక్కడే కొడుకు.. బావ చనిపోయాడు. ఆమె పేరు మీద నాలుగెకరాల పొలం ఉంది. దాని విలువ కోట్లలో ఉంది. అల్లుడి అడ్డు తొలగిస్తే వార సులు లేకుండా పోయి.. అక్క తర్వాత ఆ ఆస్తి అంతా తనపరం అవుతుందని... అందుకే ఈ నేరం చేశా.’ అని చెప్పాడు. తమ్ముడే తన కొడుకును హత్య చేసిన విషయం తెలుసుకుని ఆ తల్లి గుండె పగిలేలా ఏడ్చింది. ఇంతకాలం నా కొడుకు ఏమయ్యాడో అని ఏడ్చాను. నా కొడుకు తిరిగి రాడు. కానీ.. దోషులను పట్టుకున్నారని ఆమె ఉద్వేగంగా మాట్లాడింది. ఈ సంఘటన నా కెరీర్‌లో గుర్తుండిపోయేదిగా నిలిచింది. 

సీపీ రవీందర్‌ కుటుంబం
భార్య          :     నిర్మల
కూతురు     :     నిఖిల
అల్లుడు      :     డాక్టర్‌ మధునారాయణ, డీఎన్‌బీ సర్జికల్‌ అంకాలజీ
కొడుకు      :     అభిజిత్‌ బీటెక్‌
ఇష్టమైన క్రీడ    : టెన్నీస్‌
ఇష్టమైన నటులు    : కమల్‌హాసన్, అమితాబ్‌బచ్చన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement