'ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఉండరు'
కాకినాడ : అనుబంధాలు, ఆప్యాయతలు తగ్గిపోతున్న నేటికాలంలో వాటి విలువలు, ప్రాధాన్యాన్ని వివరిస్తూ ‘పుష్కరం’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు చిత్ర దర్శకుడు ఈరంకి సుబ్బు తెలిపారు. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్న ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆయన మాటల్లోనే..
మాది పశ్చిమగోదావరి జిల్లా పాల కొల్లు. మా నాన్నగారు ఈరంకి వెంకటేశ్వరరావు పాత్రికేయులు. చిన్నతనం నుంచీ ఆయన విశ్లేషణాధోరణిని, పరిశీ లనాత్మక దృష్టిని అలవాటు చేశారు.
మంజులూరి భీమేశ్వరరావుగారి ప్రోద్భలంతో ‘చీకటి వెలుగులు’ అనే సీరియల్‌కి పాట రాశాను. ఆ తర్వాత బుల్లితెర డైరక్టర్ రుక్మిణీకృష్ణ గారితో పరిచయం ఏర్పడింది. జెమిని టీవీలో ‘9’ ‘ఏది నిజం’, మా టీవీలో ‘మా తీర్పు’ వంటి విభిన్న ధారావాహికలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటల రచయితగా గుర్తింపు వచ్చింది. శివాజీరాజా నటించిన ఆలస్యం అమృతం సీరియల్‌తో పాటు 15 సీరియల్స్‌కు రచయిత, దర్శకుడిగా పనిచేశా.
సినిమాల్లోకి ఇలా..
ప్రముఖ దర్శకులు ‘ఎన్‌కౌంటర్’ శంకర్ వద్ద దర్శకత్వంలో పనిచేశాను.ప్రస్తుతం ‘పుష్కరం’ చిత్రంతో దర్శకుడిగా వస్తున్నాను. ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు ఉండరు. క్యారరెక్టర్ల మాత్రమే ఉంటాయి. పూర్తి గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రం నిర్మిస్తున్నాం.