ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత | Irrfan Khan Last Breath In Mumbai | Sakshi
Sakshi News home page

ఇర్ఫాన్‌ ఖాన్ కన్నుమూత

Published Wed, Apr 29 2020 12:11 PM | Last Updated on Wed, Apr 29 2020 1:40 PM

Irrfan Khan Last Breath In Mumbai - Sakshi

ముంబై : బాలీవుడ్‌ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ (54) ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బుధవారం ముంబైలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న ఈ నటుడు కొన్నాళ్లు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ మధ్యే భారత్‌కు తిరిగి వచ్చిన ఆయన ఆంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. మంగ‌ళవారం ఇర్ఫాన్ మరోసారి అనారోగ్యానికి గురికావ‌డంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతూ బుధవారం క‌న్నుమూశారు. (చదవండి : క్యాన్సర్‌ కదా... అందుకే: నటుడి భావోద్వేగం!)

ఈ నెల 25న  ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మృతి చెందిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు. కన్నతల్లి మరణించిన  నాలుగైదు రోజులకే ఇర్ఫాన్‌  మృతి చెందండం బాలీవుడ్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకుంది. (చదవండి : వీడియో కాన్ఫ‌రెన్స్‌లో త‌ల్లికి నివాళుల‌ర్పించిన న‌టుడు)

కాగా, జనవరి 7, 1967న జన్మించిన ఇర్ఫాన్ ఖాన్, హిందీతో పాటు హాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్, ఎ మైటీ హార్ట్‌, జురాసిక్‌ వరల్డ్‌, లైఫ్‌ ఆఫ్‌ పై వంటి హాలీవుడ్‌ ఉత్తమ చిత్రాల్లోనూ నటించి మంచి పేరును సంపాదించారు. చిత్ర రంగంలో ఆయన చేసిన కృషికి ప్రతిఫలంగా భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 'పాన్ సింగ్ తోమర్' సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న ఇర్ఫాన్, చివ‌రిగా 'అంగ్రేజీ మీడియం' అనే సినిమాలో నటించాడు. ఈయన మొదటి సినిమా ‘సలామ్ బాంబే’. తెలుగులో కూడా ఈయన మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు సినిమాలో నటించారు. ఇర్ఫాన్‌కు భార్య సుతాపా సిక్దార్‌, ఇద్దరు కుమారులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement