యంగ్ హీరోలైతే బెటర్ : సీనియర్ నటి
ముంబై : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, నటి అమృతాసింగ్‌ల కూతురు సారా అలీఖాన్ సినిమా రంగ ప్రవేశంపై బాలీవుడ్ కోడై కూస్తోంది. సారా తొలి చిత్రం గురించి ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ, సారా స్టార్ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో సినిమా ఎంట్రీపై అభిమానుల్లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, గల్లీ బాయ్ చిత్రాల్లో సారా నటిస్తున్నట్టు పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో నిర్మించబోయే చిత్రంలో కండలవీరుడు హృతిక్ రోశన్ సరసన సారా నటించబోతున్నట్టు గాసిప్పులు గుప్పుమన్నాయి.
అయితే ఈ వార్తలపై హృతిక్ స్పందించి..అవన్ని పుకార్లని కొట్టిపారేసి ఓ క్లారిటీ ఇచ్చారు. కానీ, సారా కరణ్ జోహార్ చిత్రంతోనే సినీ ఆరంగేట్రం చేయనుందని సైఫ్ అలీఖాన్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం, కరన్ తదుపరి ప్రాజెక్ట్లో హృతిక్ నటిస్తుండటంతో గాసిప్పులకు మళ్లీ ఆజ్యం పోసినట్టయింది.
కాగా, సారా నిర్ణయంపై తల్లి అమృతా సింగ్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. సారా వయసుకు తగ్గ హీరోతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అమృత అభిప్రాయపడుతున్నట్టు ఓపెన్ మ్యాగజైన్ పేర్కొంది. సారా తొలి చిత్రంలో యువకుల సరసన హీరోయిన్‌గా నటిస్తేనే ఎక్కువ కాలం హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం ఉంటుందని అమృత భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సన్నీ డియోల్ కుమారులు కరన్ డియోల్, రజ్వీర్ డియోల్‌లలో ఎవరో ఒకరికి జోడీగా ఆరంగేట్రం చేస్తే బాగుంటుందని అమృతా భావిస్తున్నట్టు సమాచారం. అమృతాసింగ్, సన్నీడియోల్‌లు ఇద్దరు మంచి స్నేహితులు. అంతేకాకుండా 1983లో బితాబ్ చిత్రంలో సన్నీడియోల్ సరసన హీరోయిన్‌గా అమృతాసింగ్ తెరంగేట్రం చేసింది.
అమృతాసింగ్, సైఫ్ దంపతులకు సారా, ఇబ్రహీం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అమృతా సింగ్ కు విడాకులిచ్చిన సైఫ్ కరీనాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.