
బ్రాడ్‌పిట్ , మరియన్ కాటిల్లార్డ్
హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ బ్రేకప్ కథనాలు మళ్లీ జోరందుకున్నాయి. భార్య జోలీ కళ్లుగప్పి.. పిట్ తన ప్రియురాలు మరియన్ కాటిల్లార్డ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని తాజాగా హాలీవుడ్ కోడై కూస్తున్నది. జోలీతో తెగదెంపులు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కాటిల్లార్డ్‌తో పిట్ ప్రణయ సల్లాపాలు నెరుపుతున్నట్టు హాలీవుడ్ వర్గాల భోగట్టా.
ప్రస్తుతం పిట్, కాటిల్లార్డ్ ప్రస్తుతం 'ఫైవ్ సెకండ్స్ ఆఫ్ సైలెన్స్ ఇన్ ఇంగ్లండ్' సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 'ఈ ఇద్దరి మధ్య ఏదో గూడుపుఠాణి నడుస్తోంది. వారి మధ్య రహస్యంగా జరగకూడనిది జరుగుతోంది. తమ మధ్య ఉన్నదానిని రహస్యంగా ఉంచి పబ్లిగ్గా చూడటానికి మాత్రం తమ మధ్య ఏమీ లేనట్టు వారు నటిస్తున్నారు' అని ఈ సినిమాకు సంబంధించిన ఇన్‌సైడర్లు చెప్పినట్టు 'హాలీవుడ్‌లైఫ్.కామ్' తెలిపింది. (చదవండి: ఔను! వాళ్లు కూడా విడిపోతున్నారట!)
'గతంలో బ్రాడ్-జోలీ జంట ఎవరికివారుగా చాటుమాటుగా చిన్నపాటి సరస సల్లాపాలు నెరిపినా.. అవి పెద్ద దూరం వెళ్లకపోవడంతో వీరి బంధంపై ఆ ప్రభావం పడలేదు. కానీ బ్రాడ్ ఇటీవలికాలంలో మరియన్‌కు ఎమోషనల్‌గా దగ్గరవుతున్నాడు. ఇది ఈ జంట దాంపత్య జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. ఇది వీరి పెళ్లి పెటాకులవ్వడానికి దారితీయవచ్చు' అని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. చైన్ స్మోకింగ్, మద్యం వంటి అలవాట్ల కారణంగా భారీగా బరువు తగ్గిన ఏంజెలినా జోలీ ప్రస్తుతం 35 కిలోల బరువుకు పడిపోయి.. బలహీనంగా మారిపోయిందని, దాంతో ఆమెను బ్రాడ్ పట్టించుకోవడం మానేశాడని గతంలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదకొండు ఏళ్ల తమ వైవాహిక జీవితానికి తెరదించాలని ఈ జంట భావించినట్టు, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నట్టు గతంలోనూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.