తమన్నా
తమిళసినిమా: ఇకపై అలా చేస్తే అర్థం ఉండదు అంటోంది నటి తమన్నా. కథానాయకిగా పుష్కరకాలాన్ని దాటేసిన ఈ బ్యూటీ ఇప్పటికీ నటిగా తన స్థాయిని కాపాడుకుంటూనే వస్తోంది. కోలీవుడ్‌లో కలూరి, పడిక్కాదవన్, అయన్, పయ్యా, చిరుతై, వీరం, ధర్మదురై చిత్రాల నుంచి ఇటీవల విక్రమ్‌తో నటించిన స్కెచ్ చిత్రం వరకూ పలు సక్సెస్‌లు తన ఖాతాలో వేసుకుంది . ఇక బాహుబలి చిత్రంలో విప్లవ యువతిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
అయితే ప్రస్తుతం తమిళంలో కొత్త చిత్రం లేకపోయినా, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగానే ఉంది. హిందీలో సంచలన విజయం సాధించిన క్వీన్ చిత్ర తెలుగు రీమేక్‌లో నటిస్తున్న తమన్నా తన 12 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి తెలుపుతూ ఇంత కాలం కథానాయకిగా రాణించడం నిజంగా తన అదృష్టం అని పేర్కొంది. ఇప్పటి వరకూ పొందిన అనుభవాలను ఇకపై నటించనున్న చిత్రాలకు ఉపయోగిస్తాను అని అంది. మొదట్లో ఒకటి రెండు తప్పులు చేసినా పెద్దగా పట్టించుకోరని కొత్త కదా! పోను పోను నేర్చుకుంటుందిలే అని భావిస్తారని పేర్కొంది. అయితే ఇకపై అలా కుదరదని, తనపై బాధ్యత పెరిగిందని చెప్పింది.
ఇన్ని చిత్రాల్లో నటించి, ఇంత అనుభవం గడించిన తరువాత సాధారణ పాత్రల్లో నటిస్తే అర్థం ఉందని అంది. అందుకే నటనకు అవకాశం ఉన్న కథా చిత్రాలనే అంగీకరించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. అవి కమర్శియల్ పరంగానూ విజయం సాధించాలని పేర్కొంది. అలాంటి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తానని చెప్పింది. కొత్త తారలు మోడ్రన్ డ్రస్ ధరించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని, అయితే ఎంత కొత్త దుస్తులు అయినా ధరించడానికి సౌకర్యంగా ఉన్నాయా అన్నది ముఖ్యం అని అంది. ఎలాంటి దుస్తులు ధరించినా, అవి మన శరీరాకృతికి నప్పేలా ఉన్నాయా? అన్నది కూడా గమనించాలని చెప్పింది. సౌకర్యంగా ఉండే దుస్తులు ధరిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తమన్నా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment