
32 ఏళ్లలో 500 సినిమాలు!
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు అనుమప్ ఖేర్ మరో మైలు రాయిని అందుకున్నారు. 500వ సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ సినిమా 'ది బిగ్ సిక్' తనకు 500వ సినిమా అని ట్విటర్ లో అనుమప్ ఖేర్ తెలిపారు. హోలి హంటర్, రే రొమానొ, జియ్ కజాన్, కుమైల్ నాన్జియాని వంటి నటులతో తెర పంచుకోవడం గొప్పగా ఉందని ట్వీట్ చేశారు. ఆయనకు ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ డినీరో అభినందనలు తెలిపారు.
1984లో 'సారాంశ్'తో సినిమా జీవితం మొదలు పెట్టిన అనుమప్ ఖేర్ అంచెలంచెలుగా ఎదిగారు. 61 ఏళ్ల ఖేర్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు. హాలీవుడ్ సినిమాతో 500 మైలురాయిని అందుకోవడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 32 ఏళ్ల పాటు హిందీ సినిమాల్లో నటించానని ఇప్పుడు కొత్త వేదికల కోసం చూస్తున్నానని చెప్పారు.
500 సినిమాలు చేస్తానని కెరీర్ ఆరంభంలో ఊహించలేదన్నారు. 29 ఏళ్ల వయసులో తెరగ్రేటం చేసిన తాను 'సారాంశ్'లో 65 ఏళ్ల వృద్ధుడి పాత్రలో నటించానని గుర్తు చేశారు. కొత్తతరంతో అనుసంధానం కావడానికి సోషల్ మీడియా తనకెంతో ఉపయోగపడుతోందని , దీని నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. ఎవరేమన్నా దేశం గురించి తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తం చేస్తుంటానని అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు.
Happy to announce my 500th film 'The Big Sick'. And who else but to have Robert De Niro congratulate me. Jai Ho.:) pic.twitter.com/9fcYvnuLL7
— Anupam Kher (@AnupamPkher) 14 June 2016