వంద కోట్లంటే వంద కోట్ల మంది ప్రేమ
‘‘బన్నీ నన్నెప్పుడూ ఆటపట్టించేవాడు. సార్.. మన బ్యానర్లో మీరు మాస్ సినిమా తీయలేరని. మా బ్యానర్లో 25వ సినిమా, బన్నీ హయ్యస్ట్ గ్రాసర్ ‘డీజే’నే. బన్నీ.. 4 రోజుల్లో 75 కోట్ల గ్రాస్ క్రాస్ చేసి, వారంలో వంద కోట్లు.. సో.. ఇంపాజిబుల్ అన్నది నీ ద్వారానే పాజిబుల్ అయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో ‘దిల్’రాజు, శిరీష్ నిర్మించిన ‘డీజే దువ్వాడ జగన్నాథమ్’ సినిమా థ్యాంక్స్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది.
‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘అన్నా.. మీ బ్యానర్లో నా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, హయ్యస్ట్ కలెక్షన్స్ రావాలి’ అని హరీష్ కోరిక. అది ‘డీజే’తో సాధ్యమైంది. ఈ సక్సెస్‌కు పిల్లర్స్ బన్నీ, హరీష్. థియేటర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, బయటకి రాగానే ‘యస్.. ఈ సినిమా మనం అనుకున్నట్టు బ్లాక్‌బస్టర్ హిట్. ఎవరు ఏదన్నా వినొద్దు’ అనే నమ్మకంతో వచ్చాం. అది నిజమైంది. మా బ్యానర్లో 25వ చిత్రం ఫస్ట్ వీక్‌లోనే వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తోందంటే ఇంతకు మించిన సమాధానం లేదు ‘డీజే’ విషయంలో. ప్రతి హీరోతో మా సంస్థలో సినిమా చేయాలి. ఈ రోజు సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ అయినా మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు. ఏ హీరో అభిమానీ మరో హీరోని తక్కువ చేయొద్దు.
ఎందుకంటే మనమందరం తెలుగువాళ్లం. తెలుగు సినిమా స్థాయి పెంచండి. ప్రతి అభిమానికీ నా రిక్వెస్ట్ ఇది. ‘బాహుబలి’ తర్వాత ‘డీజే’ అని ముంబయ్ నుంచి ట్వీట్లు చేస్తున్నారు... ‘డీజే’ చూసి, కంపేర్ చేసుకుని హిందీ సినిమాలు తీయండి అని. అదీ మన తెలుగు సినిమా స్టామినా’’ అన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘నన్ను ప్రేమిస్తున్న నా ఫ్యాన్స్, సపోర్ట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్, మమ్మల్ని దీవించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా అందరికీ ఇంత మెమరబుల్ హిట్ ఫిల్మ్ ఇచ్చిన హరీష్‌కి థ్యాంక్స్. రివ్యూల్లో కొంత నెగెటివిటీ ఉన్నా ప్రేక్షకుల పాజిటివిటీ ముందు నిలవలేదు. ‘దిల్’ రాజు, నా కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ ప్రేక్షకులు ఇచ్చిన గిఫ్టే. కలెక్షన్లు అన్నవి ఒక నంబర్ కాదు. నేనెప్పుడూ చూసేది ఎంతమంది చూశారు
అని. వంద కోట్లంటే అది నంబర్ కాదు. వంద కోట్ల మంది ప్రేమ’’ అన్నారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ– ‘‘బన్నీ నన్ను పిలిచి మనం సినిమా చేస్తున్నాం. ఆ సినిమా ఇద్దరి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలన్నారు.. అయింది. విమర్శలకు బాక్సాఫీస్ సమాధానం చెబుతుంది. సినిమా అంటే వినోదం. సినిమా నచ్చకపోతే ఈ సీన్, స్టోరీ, క్యారెక్టర్ బాగాలేదని విమర్శించండి తప్పులేదు. కానీ, డైరెక్టర్‌ని విమర్శించకండి. డబ్బులు పెట్టి సినిమా చూసే ప్రేక్షకులు రివ్యూ ఇవ్వండి. అంతేకానీ, వేరే వారిచ్చిన రివ్యూలను న మ్మొద్దు. మా సినిమా నాన్ ‘బాహుబలి’ రికార్డులను కొట్టుకుంటూ వెళుతోంది. ఓ మంచి మూవీ చేసినప్పుడు కలెక్షన్లు మాట్లాడాలి తప్ప రివ్యూలు కాదు’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కెమెరామేన్ బోస్, నటులు తనికెళ్ల భరణి, రావు రమేశ్, సుబ్బరాజు, రచయిత జొన్నవిత్తుల తదితరులు పాల్గొన్నారు.