నా లైఫ్‌లో డైరెక్షన్ చేయను
► ‘దిల్’ రాజు
‘‘అన్నా.. నువ్వో సినిమా డైరెక్ట్ చేయొచ్చు కదా’ అని వినయ్ (వీవీ వినాయక్) నన్నెప్పుడో అడిగారు. ‘మీరు డైరెక్షన్ చేయొద్దు’ అని ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు అంటున్నారు. నేను మీకు హామీ ఇస్తున్నా. నా లైఫ్‌లో డైరెక్షన్ చేయను’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన 25వ చిత్రం ‘డీజే’ (దువ్వాడ జగన్నాథమ్).
ఇప్పటివరకూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో పనిచేసిన 17మంది డైరెక్టర్ల సమక్షంలో ‘డీజే’ ట్రైలర్ లాంచ్ చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘పధ్నాలుగేళ్లుగా మా సంస్థ ఇక్కడుందంటే కారణం డైరెక్టర్లే. దర్శకులు పడే కష్టం, తపన ఏంటో నాకు తెలుసు. అందుకే నేను డైరెక్షన్ జోలికి వెళ్లను. ‘డీజే’ తర్వాత హరీశ్‌తో మరో సినిమా చేస్తాం. మా బ్యానర్‌లో వంద సినిమాలు ఏమో కానీ యాభై సినిమాలు మాత్రం తీయగలనని చెప్పగలను’’ అన్నారు. ‘‘రామానాయుడుగారు ఎప్పుడూ స్టార్లను నమ్మి సినిమాలు తీయలేదు. కథను నమ్మి తీశారు. అదే క్వాలిటీ శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌లో ఉంది’’ అన్నారు వీవీ వినాయక్. ‘‘రాజుగారు ఓ గైడ్‌బుక్ లాంటి వారు. ఆయన డైరెక్టర్లకు ధైర్యం. వేళ్లమీద లెక్కపెట్టుకునే మంచి నిర్మాతల్లో రాజుగారు తొలి వ్యక్తి’’ అన్నారు బోయపాటì శ్రీను.
‘‘హీరో, నిర్మాతలకు ట్రైలర్ చూపించాలంటేనే భయం. ఒకేసారి 17 మంది దర్శకులకు ట్రైలర్ చూపించాలంటే ఎంత ధైర్యం కావాలి. వినయ్‌గారి వద్ద అసిస్టెంట్‌గా పెట్టమని కోన వెంకట్‌గారిని ఎన్నోసార్లు అడిగినా కుదర్లేదు. కానీ, నేను వినయ్ గారికి ఏకలవ్య శిష్యుణ్ణి’’ అన్నారు హరీష్ శంకర్. ‘‘రాజుగారు 100 సినిమాలు చేసి, రామానాయుడిగారి స్థాయికి ఎదగాలి’’ అన్నారు దశరథ్. ‘‘నా తొలి చిత్రం సరిగ్గా ఆడకపోయినా నా టాలెంట్ గుర్తించి మరో అవకాశం ఇచ్చారు రాజుగారు’’ అన్నారు వంశీ పైడిపల్లి. ఈ వేడుకలో దర్శకులు శ్రీవాస్, శేఖర్ కమ్ముల, శ్రీకాంత్ అడ్డాల, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సాయికిరణ్ అడవి, త్రినాథరావు, అనిల్ రావిపూడి, వేణు శ్రీరాం, వాçసూ వర్మ, రాధామోహన్, సతీశ్ వేగేశ్న తదితరులు పాల్గొన్నారు.