మంచి మాట పాటించే డీజే
దువ్వాడ జగన్నాథమ్ (డీజే) చిన్నప్పుడే కాలేజీలో తన అక్కను ఇబ్బంది పెట్టినవారిని పీకుతాడు. పోలీసాఫీసర్ మురళీశర్మను గూండాలు చంపేయబోతున్నప్పుడే పదేళ్లు వయసు ఉన్న చిన్న డీజే ఆ గూండాలను కాల్చి చంపుతాడు. అంత పెద్ద రిస్క్ తీసుకున్న పిల్లవాణ్ణి అర్జునుడిని కృష్ణుడు చేరదీసినట్లు చేరదీస్తాడు మురళీశర్మ.
తాతయ్య చెప్పిన ఒక మంచి మాటని ఎప్పుడూ చెబుతుంటాడు డీజే. అదేంటంటే ‘‘మనం చేసే మంచి కనపడాలి... కానీ మనిషి కనపడక్కర్లేదు’’. అదే ఫాలో అవుతుంటాడు డీజే. తన కుటుంబంతో కలిసి అగ్రహారంలో వంటల కాంట్రాక్ట్‌లు చేస్తుంటాడు డీజే. డీజే ఉద్వేగానికి బలవుతున్న రొయ్యలనాయడు అండ్ కంపెనీ డీజే ఎవరో కనిపెట్టడానికి సర్వప్రయత్నాలు చేస్తుంటారు. ఇంతలో డీజే బాబాయ్ చంద్రమోహన్ రియల్ ఎస్టేట్ కంపెనీ అగ్రో డైమెండ్‌లో పెట్టిన పెట్టుబడి పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.
ఈ కంపెనీని మోసం చేసి తన ఉనికి తెలియకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయల స్కామ్‌ను డ్రైవ్ చేస్తుంటాడు రొయ్యలనాయుడు (రావు రమేశ్). హోమ్ మినిస్టర్ పుష్పం (పోసాని కృష్ణమురళి)ను దగ్గరకు తీసుకుంటే లూటీ చేయడం సులభం అవుతుందని అబుదాబిలో ఉన్న తన కొడుకు చంటి (సుబ్బరాజు), హోమ్ మినిస్టర్ కూతురు పూజాకి వివాహం చేయలనుకుంటాడు రొయ్యల నాయుడు. కానీ, పూజ (పూజా హెగ్డే) కన్ను డీజే మీద పడి, వారి ప్రేమ వ్యవహారం ముదురుతుంది. స్కామ్ వెనకాల ఎవరు ఉన్నారన్నది డీజేకి తెలియకపోవడం, డీజే ఎవరన్నది రొయ్యలనాయుడు అండ్ కో క్యారెక్టర్స్‌కి తెలియకపోవడం సినిమాను ముందుకు తీసుకెళుతుంటాయి. అక్కడి నుంచి రొయ్యలనాయుడి పని డీజే ఎలా పడతాడన్నదే మిగతా సినిమా.
నటీనటులు: అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు రమేష్, మురళీ శర్మ, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: అయాంక బోస్, కథ–మాటలు–దర్శకత్వం: హరీశ్ శంకర్,
సమర్పణ: శ్రీమతి అనిత, నిర్మాతలు: ‘దిల్’ రాజు, శిరీష్