ఆల్‌మోస్ట్ అందరితో... ఆకర్షణలో పడ్డా! | I've been infatuated by almost every actor I've worked with says Shriya Saran | Sakshi
Sakshi News home page

ఆల్‌మోస్ట్ అందరితో... ఆకర్షణలో పడ్డా!

Published Wed, Jul 29 2015 10:30 PM | Last Updated on Sat, Sep 29 2018 5:17 PM

ఆల్‌మోస్ట్ అందరితో... ఆకర్షణలో పడ్డా! - Sakshi

ఆల్‌మోస్ట్ అందరితో... ఆకర్షణలో పడ్డా!

దక్షిణాదిన సూపర్‌హిట్ సినిమాలతో తన సత్తా చాటుకున్న హీరోయిన్  శ్రీయ.  ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లోనూ తనను తాను నిరూపించుకునే పనిలో ఉన్నారు. హిందీలో అజయ్ దేవ్‌గణ్, తబులతో కలసి ఆమె నటించిన ‘దృశ్యం’  ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సూపర్‌హిట్ కథతో కెరీర్‌కు కొత్త  ఊపు వస్తుందని ఆశిస్తున్న ఈ కథక్ నర్తకిలో ఎన్నో భిన్నమైన కోణాలున్నాయి.  తల్లిదండ్రులతో గాఢమైన అనుబంధమున్న ఈ యు.పి. అమ్మాయి అంధులతో  ఏకంగా ఒక స్పా నిర్వహిస్తున్నారు.  తల్లితండ్రుల గురించి, సినీరంగంలో సన్నిహితుల గురించి, మొత్తం అంధులతోనే తాను నడుపుతున్న స్పా గురించి ఈ అందగత్తె పంచుకున్న కబుర్లు... ఆమె మాటల్లోనే...
 
 నా కోసం మకాం మార్చారు!
 ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా మా అమ్మనే ప్రేమిస్తాను. నా కోసం ఆమె అన్నీ వదులుకుంది. భోరున వర్షం కురిసే వేళల్లో సైతం నేను డ్యాన్స్ క్లాస్‌కు వెళితే, ఆమె నాకు తోడుగా వచ్చేది. గజ్జెల రాపిడికి నా పాదాలు నెత్తురు చిమ్మితే, దగ్గరే ఉండి సేవ చేసేది. ఆమె తోడు లేకుండా నా ఎన్జీవోను గానీ, స్పాను గానీ నడపలేను. ఇంట్లో నేను తీరికగా గడిపే వేళల్లో కూడా మా అమ్మ ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఉంటుంది. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే అదంతా మా అమ్మ చలవే. మేము ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాయస్థులం. నా పూర్తి పేరు శ్రీయా శరణ్ భట్నాగర్. మా నాన్న పుష్పీందర్ శరణ్ బీహెచ్‌ఈఎల్‌లో ఇంజనీర్‌గా పనిచేసేవారు.

నేను పుట్టింది, పెరిగింది హరిద్వార్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో. మా అమ్మ కూడా ఉద్యోగి. కెమిస్ట్రీ టీచర్. బీహెచ్‌ఈఎల్‌లోని ఆరుబయలు రంగస్థలం ‘ఝంకార్’లో ఇచ్చిన ప్రదర్శన ఫలితంగా నేను సినీ రంగంలోకి అడుగుపెట్టగలిగాను. నాకు కథక్ అంటే మహా పిచ్చ. ఢిల్లీలోని శోభనా నారాయణ్ వద్ద కథక్ నృత్యం నేర్చుకున్నాను. నేను డ్యాన్‌‌స నేర్చుకోవడం కోసం మా అమ్మ నాతో పాటే ఢిల్లీకి మకాం మార్చింది. మథుర రోడ్‌లోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లం. అక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చేరాను. పండారా రోడ్‌లోని డ్యాన్స్ క్లాస్ వద్దకు మా అమ్మ రోజూ నన్ను బండిలో దిగబెట్టేది. ఆ తరువాత కొన్నాళ్ళకు మా నాన్న గారు ఢిల్లీకి ట్రాన్‌‌సఫర్ చేయించుకొని వచ్చారు. డ్యాన్స్ నేర్చుకుంటున్నప్పుడు శోభనా దీదీతో కలసి దేశమంతా తిరుగుతూ ప్రదర్శనలు ఇచ్చేదాన్ని.
 
 అలా సినిమాల్లోకి వచ్చా!
 ఒకసారి వారణాసికి చెందిన కొందరు మ్యూజిక్ వీడియో ఆల్బవ్‌ు రూపొందిస్తామంటూ శోభనా దీదీని కలుసుకున్నారు. అప్పుడామె వారికి నా పేరు సిఫారసు చేశారు. ఆ వీడియో చూసిన ఒక తెలుగు దర్శకుడు నాకు ఆఫర్ ఇవ్వడంతో మొదటిసారిగా తెలుగు సినిమాలో నటించాను. అయితే, నాగార్జునతో నటించిన ‘సంతోషం’ హిట్ కావడంతో నాకు బ్రేక్ వచ్చింది. అదే నా రెండో చిత్రం. తర్వాత ఇటు తెలుగు, అటు తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చాను. రజనీకాంత్‌తో తమిళంలో నటించిన ‘శివాజీ’ నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ సినిమా భారీ హిట్. అలా వరుసగా నాకు నాలుగు దక్షిణాది భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు నేను నాలుగు దక్షిణాది భాషలూ బాగా మాట్లాడగలను. హిందీ చిత్రాల్లోనూ అడపాదడపా నటిస్తున్నా.
 
   నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్
 నా కెరీర్‌లో బిగ్గెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ అంటే ‘దృశ్యవ్‌ు’ సినిమానే. అజయ్ దేవ్‌గణ్, తబులతో కలసి నటించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అన్ని భాషల్లో హిట్టయిన ఆ చిత్రకథ బాలీవుడ్‌లోనూ మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు అజయ్ ఎంతో సహకరించారు. అలాగే, నేను అభిమానించే నటి తబు. ఆమెతో కలసి నటించడం నాకు మరపురాని అనుభవం.
 
   అంధులతో అనుబంధం..
 అంధులే నిర్వహించే ఒక ప్రత్యేక స్పా నడుపుతున్నా. దీని వెనుక ఒక కారణం ఉంది. మథుర రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంటున్నప్పుడు ఒకసారి నేను బస్సు మిస్సయ్యా. స్కూల్ బస్సు ఆగే చోటుకు ఎదురుగానే అంధుల స్కూల్ ఉండేది. ఎప్పుడైనా అక్కడికి ఓసారి వెళ్లాలని మా అమ్మ నాతో చాలాసార్లు చెబుతూ ఉండేది. బస్సు మిస్సవడంతో ఆ రోజు రోడ్డు దాటి ఆ స్కూల్‌లో అడుగు పెట్టాను. స్కూలు ఆవరణలోని చెట్టు కింద కూర్చుని, అక్కడే ఆడుకుంటున్న పిల్లలను చూస్తూ ఉంటే, వాళ్లలో ఒక పిల్లాడు నా పక్కకు వచ్చి కూర్చున్నాడు. చేతులతో నా ముఖం తడిమి నేనెవరినో, ఎందుకు అక్కడకు వచ్చానో అడిగాడు.

నేను బస్సు మిస్సయ్యానని చెబితే, ఒకటే నవ్వు మొదలుపెట్టాడు. ‘నేను అంధుణ్ణి.. నేనెప్పుడూ బస్సు మిస్సవలేదు. మరి నువ్వెలా బస్సు మిస్సయ్యావు?’ అని అడిగాడు. ఆ పిల్లాడి అమాయకత్వం నాకు నచ్చింది. అప్పటి నుంచి ఆ అంధుల స్కూల్‌తో అనుబంధం మొదలైంది. ఆ స్కూల్‌లో జరిగే దీపావళి వేడుకలకు హాజరయ్యేదాన్ని. సినిమాల్లో అవకాశాల కోసం ఢిల్లీ వదిలి, ముంబయ్ బయలుదేరినప్పుడే అనుకున్నాను... అంధుల కోసం ఏదైనా చేయాలని. ఒకసారి బ్యాంకాక్ షూటింగ్ వెళ్లి అక్కడే నెల్లాళ్లు ఉన్నప్పుడు నాతోనే వచ్చిన మా అమ్మ అక్కడ స్పా థెరపిస్టుగా బేసిక్ కోర్సు పూర్తి చేసింది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ముంబయ్‌లో అంధుల కోసం స్పా థెరపిస్టు కోర్సు ఉన్నట్లు తెలుసుకున్నాం. దాంతో పూర్తిగా అంధులతోనే స్పా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.

 రెండు గదులలో ‘స్పందన’ పేరిట స్పా ఏర్పాటు చేశాం. మా స్పాలోని థెరపిస్టులందరూ చూపు లేనివారే. అయినా, వాళ్లు తమంతట తామే రోజూ స్పాకు వస్తారు. క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించుకుని, తిరిగి తమ తమ ఇళ్లకు వెళతారు. క్యాష్ కౌంటర్ దగ్గర పనిచేసే అమ్మాయికి డెబ్భై శాతం చూపు లేదు. అయినా, చేతులతో తడిమి కరెన్సీ నోట్లను గుర్తించడం, లెక్కపెట్టడం బ్రహ్మాండంగా చేయగలదు. ఈ స్పా నడపడం చాలా కష్టమే. అయినా సరే, దీన్ని ఎప్పటికీ ఆపకూడదనుకుంటున్నా. నన్నడిగితే, పక్కవాళ్ళను చూసి జాలిపడడం కన్నా, ప్రేమ చూపాలి. అందుకే నన్నడిగితే పక్కవాళ్ళతో పోటీపడి మార్కులు తెచ్చుకోవడమే నేర్పే మన స్కూళ్ళలో ‘కమ్యూనిటీ సర్వీస్’ గురించి పిల్లలకు చెప్పాలి.
 
   నాగ్... నాకు చాలా స్పెషల్!
 సినీరంగంలో నాగార్జున నాకు చాలా స్పెషల్. హి ఈజ్ స్వీట్‌హార్‌‌ట. కొత్తగా అడుగుపెట్టిన నాకు ‘సంతోషం’లో ఛాన్సిచ్చారు. ఆయన ఇంటి తలుపులెప్పుడూ నాకు తెరిచే ఉంటాయి. ఆయన భార్య అమల నాకు మంచి స్నేహితురాలు. ఆమె వల్లే ‘విపాసన’ ధ్యానం నేర్చుకున్నా. ఖాళీ దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తా. నాగార్జున అబ్బాయిలిద్దరూ కూడా నాకు బాగా తెలుసు.
 
   ఒంటరిగా వెళితే... పుకార్లు పుట్టించారు
 డేటింగ్ లాంటి విషయాల్లో నేను చాలా పాతకాలపుదాన్ని. సినిమాకు తీసుకెళ్ళి, డిన్నర్‌కు తీసుకెళ్ళాలని కోరుకొనే రకాన్ని. నాకు ఎలాంటి డేటింగ్ వ్యవహారాలూ లేవు. ఆ మధ్య నేను ‘విపాసన’ ధ్యానం చేయడానికీ, స్క్యూబా డైవింగ్ నేర్చుకోవడానికీ అండమాన్ దీవులకు ఒంటరిగా వెళ్ళా. మా అమ్మానాన్నకు చెప్పి మరీ వెళ్ళా. కానీ, నా మీద ఏవేవో పుకార్లు పుట్టించారు. ప్రత్యేకించి ఎవరితోనూ డేటింగ్ చేయలేదు కానీ, నిజం చెప్పాలంటే దాదాపు నాతో నటించిన నటులందరితోనూ ఆకర్షణలో పడ్డా. అయితే, ఆకర్షణ వేరు... ప్రేమ వేరు. ప్రేమలో పడడం అంత తేలికైన విషయం కాదని నమ్ముతా. ఇక పెళ్ళి అంటారా? చేసుకోవాలనే అనుకుంటున్నా. తగిన సమయం వస్తే అదే అవుతుంది. నేను పెళ్ళి చేసుకొనేవాడు స్నేహశీలి అయ్యుండాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగా, భావోద్వేగ పరంగా నా ఎదుగుదలకు దోహదపడేవాడై ఉండాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement