ఒక్కసారి డిసైడ్ అయితే రెండోసారి ఆలోచించను!
‘‘జయాపజయాలు సహజం. వాటిని ఎంత తేలికగా తీసుకోగలిగితే అంత మంచిది. లేకపోతే టెన్షన్ తప్పదు’’ అని శ్రీయ అంటున్నారు. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ స్థానం సంపాదించుకోగలిగిన శ్రీయ తన మాతృభాష హిందీలో మాత్రం ఆ విషయంలో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పటివరకూ హిందీలో ఆమె పది సినిమాల వరకూ చేశారు. అవేవీ బాలీవుడ్‌లో శ్రీయకు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. తాజాగా మలయాళ ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో నటించారామె. ‘దృశ్యం’ పేరుతోనే రూపొందిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.
ఈ చిత్రం మీకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉందా? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘నేనెప్పుడూ ఈ సినిమా మనకు బ్రేక్ అవుతుందని లెక్కలేసుకుని చేయలేదు. కథ, నా పాత్ర బాగున్న సినిమాలు చేశాను. హిందీలో ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలేవీ నాకు వర్కవుట్ కాలేదు. ఆ విషయం ఒప్పుకుంటాను. అలాగని, సౌత్‌లో నేను చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కాలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా నాకు ఇప్పటికీ మంచి అవకాశాలు వస్తున్నాయి.
ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాక రెండోసారి ఆలోచించకుండా ఒప్పేసుకుంటా. ‘దృశ్యం’ నాకు మంచి అనుభూతినిచ్చింది. ఇందులో సాదాసీదా గృహిణిగా నటించాను. డిజైనర్ శారీస్ కాకుండా.. మామూలు చీరలు కట్టుకున్నాను. నా రియల్ లైఫ్‌కి, ఇప్పటివరకు రీల్ లైఫ్‌లో చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉన్న పాత్ర ఇది. ఆత్మసంతృప్తినిచ్చిన పాత్ర కూడా’’ అని చెప్పారు.