రెండు కోట్ల ప్యాలెస్‌లో...
జై చాలా రిచ్. అద్దాల మేడలో ఉంటాడు. హంస తూలికా తల్పం మీద శయనిస్తాడు. ఆడంబరమైన కారుల్లో తిరుగుతాడు. టోటల్‌గా రాయల్ లైఫ్ అన్నమాట. ఇతగాడు ఉండే ప్యాలెస్ ఖరీదు ఎంతో తెలుసా? రెండు కోట్లు పైనే. ఇన్ని చెప్పారు కదా.. ‘జై’ ఏం చేస్తాడో చెప్పేయరూ అంటున్నారా? అది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. జై, లవ, కుశగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘జై లవకుశ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
జై పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను తీస్తున్నారు. ఒక్క ఈ పాత్ర కోసమే వేసిన రాయల్ ప్యాలెస్ సెట్ ఖరీదు రెండు కోట్లకు పైనే. ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్ ఆధ్వర్యంలో ఈ సెట్ తయారైంది. ఈ నెల 22వరకూ సెట్‌లో సీన్స్ తీసి, నెలాఖరున ఈ చిత్రబృందం కర్ణాటక వెళుతుంది. అక్కడ పదిరోజులు షూటింగ్ జరుగుతుంది. హైదరాబాద్ రిటర్న్ అయ్యాక మళ్లీ సెట్‌లో చిత్రీకరణ మొదలుపెడతారు. 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది. ఆగస్ట్ సెకండాఫ్ లేదా సెప్టెంబర్ ఫస్టాఫ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. కేయస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.