
రావణ దర్పం!
రావణుడిలో రౌద్రం, రాజసం రెండూ ఉంటాయి. రెండిటినీ ఒకేసారి చూపిస్తూ, దర్పం ఒలకబోస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! అటువంటి రావణ దర్పానికి ప్రతీకగా ‘జై లవకుశ’లో ఓ పాత్ర ఉంటుందట! ఎన్టీఆర్ హీరోగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ముగ్గురిలో ఇద్దరి పేర్లు లవ, కుశ అయితే... మరొకరి పేరు ‘జై’ అట! ఈ రోజు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘జై లవకుశ’లో అతని ఫస్ట్ లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు.
సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు కదా! మరి, ఈ లుక్ ఎవరిది అంటే... రౌద్ర రావణ రాజస దర్పానికి ప్రతీకగా తీర్చిదిద్దిన ‘జై’ పాత్రదనే మాటలు వినిపిస్తున్నాయి. వీటిపై దర్శక, నిర్మాతలు ఏమంటారో! రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా, నందిత ముఖ్య తారగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.